వీరిద్దరి తీరు వేర్వేరు..

గాంధీ కుటుంబానికి మల్లికార్జున్‌ ఖర్గే విధేయుడు. కష్టపడే తత్వానికి మారుపేరు. కర్ణాటకలోని బీదర్‌ జిల్లాలో నిరుపేద మిల్లు కార్మికుడి కుటుంబంలో 1942లో జన్మించిన ఆయన.. న్యాయశాస్త్రం చదివారు. విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్‌లో చేరి.. అంచెలంచెలుగా ఎదిగారు.

Updated : 01 Oct 2022 07:04 IST

వీర విధేయుడు

గాంధీ కుటుంబానికి మల్లికార్జున్‌ ఖర్గే విధేయుడు. కష్టపడే తత్వానికి మారుపేరు. కర్ణాటకలోని బీదర్‌ జిల్లాలో నిరుపేద మిల్లు కార్మికుడి కుటుంబంలో 1942లో జన్మించిన ఆయన.. న్యాయశాస్త్రం చదివారు. విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్‌లో చేరి.. అంచెలంచెలుగా ఎదిగారు. 1972లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత రెండేళ్లకు రాష్ట్రంలోని తోళ్ల పరిశ్రమ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. వేలమంది చర్మకారుల జీవితాలను మెరుగుపర్చడానికి, వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఆ కృషి ఫలితంగా.. తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ సహాయమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఎస్‌.ఎం.కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర పార్టీలో నెంబర్‌-2 స్థానంలో ఉన్న ఆయనకు సర్కారులో సరైన మంత్రిత్వ శాఖ దక్కలేదని అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని ఖర్గేను వారంతా కోరారు. కానీ తొలినుంచీ పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఆయన.. అందుకు ససేమిరా అన్నారు. తాను పార్టీ నిర్ణయాన్ని ఎన్నడూ వ్యతిరేకించబోనని, గాంధీ కుటుంబాన్ని ఇబ్బందిపెట్టబోనని స్పష్టంచేశారు.

దూరమైన సీఎం పదవి

కర్ణాటకలో 2004లో భాజపాను అధికార పీఠానికి దూరంగా ఉంచేందుకు జేడీ(ఎస్‌)తో కాంగ్రెస్‌ జట్టు కట్టింది. నిజానికి నాడు ఖర్గే సీఎం కావాల్సి ఉన్నా.. మిత్రపక్షం కారణంగా ధరంసింగ్‌ ఆ పీఠాన్ని దక్కించుకున్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఖర్గే నాయకత్వంలో పోరాడి ఓడింది. జేడీఎస్‌ నుంచి సిద్ధరామయ్య 2006లో కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పరిస్థితులు మారాయి. రాష్ట్ర పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం ఖర్గేను 2009లో జాతీయ రాజకీయాల్లోకి రప్పించింది. నిజానికి రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండటం ఆయనకు ఇష్టం లేకపోయినా.. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహించారు. ఆపై యూపీఏ హయాంలో కేంద్ర కార్మిక, రైల్వేశాఖల మంత్రిగా పనిచేశారు. 1972 నుంచి 2008 వరకు వరుసగా తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఖర్గే.. 2009, 2014లలో లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓటమి చవిచూశారు. దీంతో ఆయన్ను రాజ్యసభకు పంపిన పార్టీ.. గులాంనబీ ఆజాద్‌ పదవీ విరమణ తర్వాత అక్కడ ప్రధాన ప్రతిపక్ష నేతగా నియమించింది. ప్రస్తుతం జాతీయ స్థాయి దళిత దిగ్గజ నేతల్లో ఖర్గే ఒకరు.


మాటల మాంత్రికుడు

ఖర్గేతో పోలిస్తే శశిథరూర్‌ తీరు చాలా భిన్నం. ఖర్గే పంచెకట్టుతో గ్రామీణ భారతానికి ప్రతినిధిగా కనిపిస్తే.. నోరుతిరగని ఆంగ్లంతో అందర్నీ అదరగొట్టే థరూర్‌- ఆధునిక తరానికి అద్దంలా నిలుస్తారు! అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు వాడుతుంటారు. సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ‘మార్పు’ నినాదంతో.. కాంగ్రెస్‌లో అంతర్గత సంస్కరణలు కోరుతూ ఆయన అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. కేరళకు చెందిన దంపతులకు 1956లో లండన్‌లో జన్మించిన థరూర్‌.. భారత్‌లో పెరిగారు. అంతర్జాతీయ సంబంధాలపై పీహెచ్‌డీ చేశారు. 1978 నుంచి 2007 వరకు ఐక్యరాజ్య సమితిలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2006లో ఐరాస సెక్రటరీ జనరల్‌ పదవి కోసం బాన్‌ కీ మూన్‌పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2007లో ఐరాసను వీడారు. కాంగ్రెస్‌లో చేరి 2009లో కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. యూపీఏ హయాంలో విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లోనూ ఎంపీగా విజయం సాధించారు. చరిత్ర, సంస్కృతి, సినిమాలు, రాజకీయాలు, సమాజం, విదేశాంగ విధానం తదితర అంశాలపై థరూర్‌ 23 పుస్తకాలు రాశారు. ఆయన రాసిన ‘యాన్‌ ఎరా ఆఫ్‌ డార్క్‌నెస్‌’ పుస్తకం 2019కిగాను సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకుంది.

అసమ్మతి గళం

థరూర్‌ భార్య సునంద పుష్కర్‌ 2014 జనవరిలో దిల్లీలోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. సతీమణి మృతిపై చెలరేగిన అనుమానాలు.. ఆయన్ను రాజకీయ సుడిగుండంలోకి నెట్టాయి. సునంద మరణం కేసులో థరూర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆపై దిల్లీ కోర్టు ఆయనకు కేసు నుంచి విముక్తి కల్పించింది. కాంగ్రెస్‌లో అసమ్మతి గళం వినిపించిన జి-23 బృందంలో థరూర్‌ కూడా ఒకరు. ఫలితంగా ఆయన్ను తిరుగుబాటుదారుడిగా పేర్కొంటూ.. గాంధీ కుటుంబ విధేయులు అనేక విమర్శలు గుప్పించారు. తన మనసుకు నచ్చినట్టు తాను నడుచుకుంటారనే పేరున్న థరూర్‌.. ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్లారు. ట్విటర్‌లో ఆయన్ను 83 లక్షల మంది అనుసరిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో దిగిన థరూర్‌, ఖర్గే.. ఇద్దరూ దక్షిణాదివారే కావడం విశేషం.

- ఈనాడు, దిల్లీ

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts