Munugode bypoll: ఈసీ గుస్సా.. మునుగోడు రిటర్నింగ్‌ అధికారిపై వేటు

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)పై వేటుపడింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ.. ఆర్వోగా వ్యవహరిస్తున్న భూసేకరణ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ జగన్నాథ్‌రావుపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 21 Oct 2022 05:34 IST

కేటాయించిన గుర్తు మార్చడంపై కేంద్ర ఎన్నికల సంఘం మండిపాటు

లేని అధికారాలు వినియోగించారని వ్యాఖ్య

ఆయన స్థానంలో రోహిత్‌సింగ్‌ నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)పై వేటుపడింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ.. ఆర్వోగా వ్యవహరిస్తున్న భూసేకరణ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ జగన్నాథ్‌రావుపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను ఆర్వో బాధ్యతల నుంచి తొలగించింది. ఒక అభ్యర్థికి కేటాయించిన ఎన్నికల గుర్తును మార్చడం ద్వారా ఆయన.. లేని అధికారాన్ని వినియోగించారని తప్పుపట్టింది. రద్దు చేసిన రోడ్డు రోలర్‌ గుర్తు.. తిరిగి అదే అభ్యర్థికి కొనసాగుతుందని స్పష్టం చేసింది. గంటల వ్యవధిలోనే మిర్యాలగూడ ఆర్డీవో బి.రోహిత్‌సింగ్‌ను నూతన ఆర్వోగా నియమించగా.. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ వివాదం
నవంబరు మూడో తేదీన మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఈసీ వద్ద ఉన్న గుర్తుల జాబితా నుంచి ఒక్కొక్కరు మూడింటిని ప్రాధాన్యక్రమంలో ఎంచుకోవాలి. వాటి నుంచి లాటరీ ద్వారా గుర్తులు కేటాయిస్తారు. యుగతులసి పార్టీ నుంచి పోటీ చేస్తున్న కె.శివకుమార్‌ తొలి ప్రాధాన్యంగా రోడ్డు రోలర్‌ గుర్తును ఎంచుకున్నారు. లాటరీలో అదే గుర్తు రావడంతో దాన్ని కేటాయిస్తున్నట్లు ఈ నెల 17వ తేదీన ఆయన నుంచి ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకుడు పంకజ్‌కుమార్‌ సమక్షంలో ఆమోదం తీసుకున్నారు. తరువాత శివకుమార్‌కు సమాచారమివ్వకుండానే రోడ్డు రోలర్‌కు బదులు బేబీ వాకర్‌ గుర్తును కేటాయించడంతో ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం బుధవారం విస్తృతస్థాయిలో చర్చనీయాంశమై.. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. దీనిపై ఎన్నికల పరిశీలకుడు పంకజ్‌కుమార్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈసీ తక్షణ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులు బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆగమేఘాల మీద శివకుమార్‌కు మళ్లీ రోడ్డు రోలర్‌ గుర్తును కేటాయించి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

తక్షణం కొత్త ఆర్వో నియామకం
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నియోజకవర్గ ఎన్నికల అధికారిని మార్చాలని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారికి గురువారం వర్తమానం పంపింది. మరో అధికారిని ఎంపిక చేసేందుకు ముగ్గురి పేర్లు తక్షణం పంపాలని ఆదేశించింది. ఆ మేరకు అందిన జాబితా నుంచి రోహిత్‌సింగ్‌ను ఈసీ ఎంపిక చేసింది.

ఆయనను నియోజకవర్గ ఎన్నికల అధికారిగా నియమిస్తూ అప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఆయన బాధ్యతలు చేపట్టారు.

లేని అధికారాన్ని ఎలా వినియోగిస్తారు?
లాటరీ ద్వారా కేటాయించిన గుర్తును రద్దు చేసే అధికారం తమకు మాత్రమే ఉంటుందని.. ఆర్వోకు లేదని ఈసీ స్పష్టం చేసింది. గుర్తును రద్దు చేస్తున్నట్లు అభ్యర్థికి, పరిశీలకుడికి తెలపకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ‘ఈసీ గత ఏడాది సెప్టెంబరులో జారీ చేసిన గుర్తుల జాబితాలో 135వ నంబరుతో రోడ్డు రోలర్‌ ఉంది. ఆ జాబితాను అన్ని రాష్ట్రాలకు పంపాం. ఈసీ వెబ్‌సైట్‌లోనూ ఉంది. వాటిని పట్టించుకోకుండా గుర్తును రద్దు చేయడం లేని అధికారాన్ని వినియోగించటమే’ అంటూ ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలగించిన ఆర్వో నుంచి వివరణ తీసుకుని గురువారం సాయంత్రం అయిదు గంటల్లోగా పంపాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఈ మేరకు జగన్నాథ్‌రావు నుంచి వచ్చిన వివరణను ఎన్నికల సంఘానికి పంపారు.

నమూనా బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు ఆమోదం
పోలింగ్‌ కోసం ఈవీఎంలనే వినియోగిస్తున్నప్పటికీ.. పోస్టల్‌ బ్యాలెట్ల కోసం నమూనా బ్యాలెట్‌ పత్రాలను ముద్రిస్తారు. ఈ నమూనాను నియోజకవర్గ ఎన్నికల అధికారి కార్యాలయం సిద్ధం చేసి ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపింది. దాన్ని ఆమోదించే సమయంలో తనకు కేటాయించిన గుర్తు మార్చటంపై శివకుమార్‌ ఫిర్యాదు చేయటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై పత్రాల ముద్రణను నిలిపివేశారు. రద్దు చేసిన రోడ్డు రోలర్‌ గుర్తునే శివకుమార్‌కు కేటాయిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసిన తరువాత బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ఆమోదం తెలిపింది.

అధికార పరిధి మేరకే మార్చాను: జగన్నాథ్‌రావు
గతంలో ఉన్న ఎన్నికల నిబంధనలు, నాకున్న అధికార పరిధి మేరకే యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు గుర్తును కేటాయించానని ఇప్పటివరకు ఆర్వోగా పనిచేసిన జగన్నాథ్‌రావు తెలిపారు. ఆయన గురువారం చండూరులో విలేకరులతో మాట్లాడారు. ‘తాజాగా ఎన్నికల సంఘం నుంచి వచ్చిన  ఆదేశాల మేరకు శివకుమార్‌కు మళ్లీ రోడ్డు రోలర్‌ గుర్తును కేటాయించాం. నాకున్న అధికార పరిధి మేరకే వ్యవహరించాను. తొలుత రోడ్డు రోలర్‌ గుర్తు కేటాయించి అనంతరం దాన్ని మార్చడంపై ఈసీ వివరణ అడిగింది. దానికి సంబంధించిన వివరణ పంపించాను’ అని తెలిపారు.


హుజూర్‌నగర్‌లో ఎస్పీ.. మునుగోడులో ఆర్వో

ఈనాడు, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక ఆర్వో జగన్నాథ్‌రావుపై ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తప్పించడంతో ఎన్నికల విధుల్లో అధికారుల పాత్రపై మరోసారి చర్చ జరుగుతోంది. 2019 అక్టోబరులో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక సమయంలో అధికార తెరాసకు సహకరిస్తున్నారంటూ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో అప్పటి సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును ఈసీ ఉప ఎన్నిక విధుల నుంచి తప్పించింది. ఇప్పుడు మునుగోడులో ఆర్వోపై వేటు పడింది. దీనిపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు వినయ్‌కృష్ణారెడ్డిని ‘ఈనాడు’ సంప్రదించగా.. ‘బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో రోడ్డు రోలర్‌ గుర్తు కేటాయింపుపై ఈసీ నుంచి మాకు ఉత్తర్వులొచ్చాయి. వెంటనే సదరు అభ్యర్థికి గుర్తును కేటాయించి ఉదయం బ్యాలెట్‌ పత్రాలను ప్రచురణకు పంపించాం’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు