బాబాయ్‌.. మద్దతివ్వండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికల్లో మద్దతు కోసం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తన బాబాయి శివపాల్‌యాదవ్‌ను గురువారం కలిశారు.

Published : 18 Nov 2022 04:42 IST

మైన్‌పురి ఉపఎన్నికలో శివపాల్‌ సహకారం కోరిన అఖిలేశ్‌

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికల్లో మద్దతు కోసం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తన బాబాయి శివపాల్‌యాదవ్‌ను గురువారం కలిశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయంసింగ్‌ యాదవ్‌ ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహించేవారు. ఆయన మరణానంతరం నిర్వహిస్తున్న ఎన్నికల్లో సమాజ్‌వాదీ అభ్యర్థిగా అఖిలేశ్‌ భార్య డింపుల్‌ పోటీ పడుతున్నారు. ‘ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ లోహియా’ను శివపాల్‌యాదవ్‌ స్థాపించి ఇదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని జశ్వంత్‌నగర్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తమ నాన్న, కుటుంబ పెద్దల ఆశీస్సులు తోడుగా మైన్‌పురి ప్రజలు తమ వెంటే ఉన్నారని శివపాల్‌తో సమావేశం అనంతరం అఖిలేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయనతో సమావేశమైన చిత్రాన్ని అఖిలేశ్‌, డింపుల్‌ తమ ట్విటర్‌ ఖాతాలలో ఉంచారు. ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి విజయానికి కృషి చేద్దామని అంతకుముందు తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో శివపాల్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. ఈ స్థానానికి డిసెంబరు 5న ఎన్నికలు నిర్వహించి 8న ఓట్లను లెక్కిస్తారు.

రాంపుర్‌ ఉప ఎన్నికకు నామినేషన్‌ దాఖలు చేసిన ఎస్పీ అభ్యర్థి

బరేలీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో రాంపుర్‌ ఉప ఎన్నికకు ఎస్పీ అభ్యర్థిగా అసిం రాజా గురువారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో దోషిగా తేలి, మూడేళ్ల జైలు శిక్ష పడటంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాంపుర్‌ ఎమ్మెల్యేగా ఉన్న అజాం ఖాన్‌పై అనర్హత వేటు పడింది. దీంతో ఆ నియోజవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబరు 5వ తేదీన ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. అజాం ఖాన్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో రాంపుర్‌ ఓటర్ల జాబితా నుంచి ఆయన పేరును తాజాగా తొలగించినట్లు గురువారం అధికారులు వెల్లడించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని