విజయసాయి, అవినాశ్‌ను ఎందుకు విచారించరు?

వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీలు విజయసాయిరెడ్డి, అవినాశ్‌లను సీబీఐ ఎందుకు విచారించలేదని న్యాయనిపుణులు ప్రశ్నించారు. ఆయన హత్యను తొలిసారిగా ప్రపంచానికి చెప్పింది, రక్తపు మడుగులో మృతదేహం పడి ఉన్నా గుండెపోటు అని పేర్కొన్నదీ వారేనని పేర్కొన్నారు.

Updated : 30 Nov 2022 07:37 IST

వైఎస్‌ వివేకా హత్య కేసుపై ‘ఈటీవీ ప్రతిధ్వని’ చర్చలో న్యాయనిపుణుల ప్రశ్న

ఈటీవీ, అమరావతి: వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీలు విజయసాయిరెడ్డి, అవినాశ్‌లను సీబీఐ ఎందుకు విచారించలేదని న్యాయనిపుణులు ప్రశ్నించారు. ఆయన హత్యను తొలిసారిగా ప్రపంచానికి చెప్పింది, రక్తపు మడుగులో మృతదేహం పడి ఉన్నా గుండెపోటు అని పేర్కొన్నదీ వారేనని పేర్కొన్నారు. వివేకా హత్య, సీబీఐ దర్యాప్తు, తెలంగాణకు బదిలీకి దారితీసిన పరిణామాలపై ‘ఈటీవీ’ ప్రతిధ్వని మంగళవారం నిర్వహించిన చర్చలో పాల్గొన్న వక్తలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి సొంత బాబాయి వివేకానందరెడ్డి తన సొంతింటిలోనే హత్యకు గురై మూడున్నరేళ్లు దాటినా ఇప్పటికీ ఆ దర్యాప్తు ఎటూ తేలడం లేదు. ఏపీ పోలీసుల దర్యాప్తుపై ముఖ్యమంత్రి కుటుంబసభ్యులకూ నమ్మకం లేక సీబీఐ దర్యాప్తు కోరారు. ఆంధ్రా పోలీసులు సీబీఐకే చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ వివేకా కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇకపై సీబీఐ ఈ కేసును తెలంగాణ నుంచి దర్యాప్తు చేయబోతోంది. దీనికి దారితీసిన పరిణామాలపై ‘ఈటీవీ’ మంగళవారం ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఇందులో పాల్గొన్న వక్తల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.


వారిద్దరినీ ఎందుకు విచారించలేదు?
-జడ శ్రవణ్‌కుమార్‌, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది

మూడువేల మందిని పిలిచిన దర్యాప్తు అధికారులు.. ఎంపీలను విచారణకు ఎందుకు పిలవలేదు? 2019 మార్చి 14-15 తేదీల్లో హత్య జరిగింది. 2020 మార్చి 11న సీబీఐతో దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేయాలంది. అయినా ఇప్పటివరకూ నిందితులను పట్టుకోవడంలో సీబీఐ విఫలమైంది. సీబీఐ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయించడంతోపాటు దర్యాప్తు బృందానికి సహాయ నిరాకరణ చేస్తోంది. ఈ కేసు వెనుక ఉన్నతస్థాయి వ్యక్తులున్నారని సుప్రీంకోర్టు భావించడంవల్లే విచారణను తెలంగాణకు మార్చింది. తెలంగాణలో అయినా ఈ కేసు కొలిక్కి వస్తుందని నేను అనుకోవడంలేదు. తమకు జరిగిన అసౌకర్యంపై సీబీఐ ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు? ఈ కేసు విషయమై కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడలేకపోయింది? కేంద్రప్రభుత్వం ఎందుకు పర్యవేక్షించడం లేదు? సీబీఐ ఈ కేసులో బాధితురాలు అయిందా.. అని అనిపిస్తోంది. భాజపా నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రానిదే ఈ కేసు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు.


విచారణకు జగన్‌ ఎందుకు సహకరించడం లేదనేదే ప్రశ్న
-ఎ.శ్రీనివాసరావు, రాజకీయ విశ్లేషకుడు

వివేకా హత్య సమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా సీబీఐ విచారణ కోరారు. ఎన్నికల సమయంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తాను సీఎం అయిన ఈ మూడున్నరేళ్లలో విచారణ త్వరతగతిన జరగడానికి ఎందుకు సహకరించడం లేదనేది అందరిలోనూ ఉన్న ప్రశ్న. సాక్ష్యాలు ధ్వంసం చేసినవారు ఎవరు? గొడ్డలితో నరికిన మృతదేహాన్ని చూసి కూడా గుండెపోటు అని చెప్పినవారిని సీబీఐ ఇంతవరకు పిలిచి ప్రశ్నించలేదు. అందుకే వివేకా కుమార్తె సునీతకు నమ్మకం కుదరడంలేదు. అన్న సీఎంగా ఉన్నా పోలీసు వ్యవస్థపై నమ్మకం లేకనే ఆమె దిల్లీ వీధుల్లో తిరగాల్సి వచ్చింది. దస్తగిరి వాంగ్మూలం చూశాక వివేకా హత్య ఇంత తీవ్రంగా జరిగిందా అని ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. చనిపోయిన వ్యక్తి తన బాబాయి కావడంతో జరిగిన విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత జగన్‌కు ఉంది. దర్యాప్తు అధికారులను పదేపదే మారుస్తుండడంతో సీబీఐ పట్ల, పోలీసుల పట్ల అపనమ్మకం సునీతతో పాటు ప్రజల్లోనూ ఉంది. రాజకీయాలు ఎలా ఉన్నా సీబీఐ, పోలీసులు వారి వ్యవస్థల ప్రతిష్ఠలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందులోని అధికారులపై ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని