ప్రజా చైతన్యం, తిరుగుబాటుతోనే.. జగన్‌ పాలన అంతం

రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే భస్మాసురుడి కథ గుర్తుకొస్తోంది. అతడి మాటలు నమ్మి భోళాశంకరుడు వరమిచ్చారు.

Updated : 01 Dec 2022 07:10 IST

అధికారంలోకి వస్తే మరింత మెరుగ్గా సంక్షేమ కార్యక్రమాలు
బాబాయి కేసు బదిలీపై జగన్‌ స్పందించాలి
జగన్‌ వెనుక పోలీసులుంటే.. నా వెంట జనం ఉన్నారు
‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు
ఏలూరు జిల్లాలో లాంఛనంగా ప్రారంభం

రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే భస్మాసురుడి కథ గుర్తుకొస్తోంది. అతడి మాటలు నమ్మి భోళాశంకరుడు వరమిచ్చారు. ఆ వరాన్ని శంకరుడిపైనే ప్రయోగించే ప్రయత్నం చేశాడు భస్మాసురుడు. నాడు మీరూ అలాగే జగన్‌ ముద్దులకు, మాటలకు మోసపోయారు. భస్మాసురుడిలా జగన్‌ ఇప్పుడు అందరి నెత్తిన హస్తం పెడుతున్నారు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. ఐటీ రంగాన్ని భ్రష్టు పట్టించారు. రైతులకు మద్దతుధర లేదు. మోటార్లకు మీటర్లే రైతులకు ఉరితాళ్లు.

ఏలూరు జిల్లా విజయరాయిలో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు - అమరావతి, పెదవేగి, దెందులూరు, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలన అంతం కావాలంటే ప్రజల్లో చైతన్యం, తిరుగుబాటు రావాలి. మూడున్నరేళ్ల నుంచి అన్ని వర్గాలవారూ ఇబ్బందులు పడుతున్నారు. వంట గ్యాస్‌, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోలు.. అన్నింటి ధరలూ పెరిగాయి. సంక్షేమ కార్యక్రమాల పేరున జగన్‌ ఇచ్చేది రూ.10 అయితే.. జనం నుంచి రాబట్టేది రూ.100. నాకు అవకాశం కల్పిస్తే రాష్ట్ర పూర్వవైభవానికి పాటుపడతా. నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తానని వాలంటీర్లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను సంక్షేమం ఆపను.. సంపద సృష్టించి మరింత మెరుగైన సంక్షేమం అందిస్తా. ప్రజలకు మంచి ఇళ్లు కట్టించి ఇస్తా. ఉపాధి కల్పిస్తా’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం విజయరాయిలో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఆయన బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వివిధ గ్రామాల్లో రోడ్‌ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. విజయరాయిలోని జంగాల కాలనీకి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధర్మాజీగూడెంలో విద్యార్థులతో ముచ్చటించారు.

విన్నారా.. నా మాట

‘అధికారంలోకి వస్తే.. పోలవరం, అమరావతి ఆపేస్తారని ఆనాడే చెప్పాను. కానీ నా మాట మీరు వినలేదు. జగన్‌ను నమ్మి నాడు ఓట్లు వేశారు. నేను అన్నట్లే ఆ రెండింటినీ ముంచేశారు. ఇప్పుడూ నా మాట వినకపోతే రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం అవుతుంది. నాకు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పదవులు కొత్త కాదు. ఆనక ఇబ్బంది పడేది మీరే. దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు నేరస్థుడి చేతికి రాష్ట్రాన్ని అప్పగించారు. తెదేపా సభకు వెళ్తే తనకు ఇచ్చిన ఇంటి స్థలం తీసేస్తానని బెదిరించినా... ఓ మహిళ చంద్రన్న సభకు వస్తానని చెప్పి మరీ వచ్చారు. అదీ తెగువ. అందరిలో అలాంటి తెగింపు రావాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

వివేకా కేసు బదిలీ జగన్‌కు చెంపదెబ్బ

‘సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు జగన్‌కు చెంపపెట్టు. సీఎం దీనికి సమాధానం చెప్పాలా, వద్దా? చెప్పలేకపోతే పదవికి రాజీనామా చేయాలి. పోలీసుల మెడపై కత్తి పెట్టి వారితో సీఎం జగన్‌ పని చేయిస్తున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో మనసు చంపుకొని పని చేస్తున్నారు. లేనిపక్షంలో వారిని వీఆర్‌కు పంపుతున్నారు. మరికొందరు తప్పుడు మార్గం పట్టారు. జగన్‌కు పోలీసులు ఉంటే.. నా వెంట ప్రజలున్నారు’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

నన్ను, లోకేశ్‌నూ చంపేస్తారట..

‘రాష్ట్ర ప్రజల నెత్తిన ఆయన భస్మాసుర హస్తం పెట్టారు. పోలవరం పనులు మేం 72% పూర్తి చేస్తే.. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్‌ టెండర్‌ అని పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. మూడున్నరేళ్లయినా ప్రాజెక్టు అతీగతీ లేదు. నా హయాంలో ఐటీ ఉద్యోగాలొస్తే, జగన్‌ వాలంటీరు ఉద్యోగాలు, చదువుకున్న వారికి చేపలు, మాంసం దుకాణాల్లో పనులు ఇచ్చారు. విభజన కంటే ఎక్కువ నష్టం ఇప్పుడు జరిగింది. రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ఒక్కో రైతుపై రూ.2.74 లక్షల అప్పు పేరుకుపోయింది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడితే అవే ఉరితాళ్లవుతాయి. తలచుకుంటే.. నన్ను, లోకేశ్‌ను చంపేసేవారమని రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు వ్యాఖ్యానించడం వారి అరాచకానికి పరాకాష్ఠ. బాబాయిని చంపినంత సులువు అనుకుంటున్నారా? ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడతామా? మీరు ఒక్క దెబ్బ వెయ్యాలనుకుంటే.. ప్రజలు మీ బట్టలు ఊడదీస్తారు’ అని హెచ్చరించారు.

తాడేపల్లిలో ఓ సైకో.. ఇక్కడ మరో సైకో

దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని లండన్‌ బాబు అంటూ చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడారు. తాడేపల్లిలో ఓ సైకో ఉన్నారని, ఇక్కడా మరో సైకో తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారని.. ఇలాంటి వేషాలు వేస్తే లండన్‌ బాబును మళ్లీ లండన్‌ పంపుతామని వ్యాఖ్యానించారు.

అడుగడుగునా బ్రహ్మరథం

ఏలూరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు అడుగడుగునా ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఉదయం 11.15 గంటలకు కలపర్రు టోల్‌గేటు వద్ద అపూర్వస్వాగతం లభించింది. జాతీయ రహదారి జన సంద్రమైంది. అక్కడి నుంచి ప్రారంభమైన రోడ్‌షో రెండు నియోజకవర్గాల గుండా సాగింది. మహిళలు బ్రహ్మరథం పట్టారు. యువకులు వాహనం వెంట పరుగులు తీశారు. అన్నిచోట్లా బంతిపూలు చల్లి, గజమాలలతో స్వాగతం పలికారు. పర్యటన ఆలస్యమైనా అర్ధరాత్రి వరకూ ప్రజలు చంద్రబాబు కోసం ఎదురుచూశారు.

మార్గంలో వైకాపా ఫ్లెక్సీలు

బాబు పర్యటన సాగిన మార్గమంతా వైకాపా ఫ్లెక్సీలు, తోరణాలతో నింపేశారు. సోమవారం వైకాపా ఆధ్వర్యంలో యాత్ర జరగడంతో స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. చింతలపూడి నియోజకవర్గంలోని గ్రామాల ప్రధాన కూడళ్లలోనూ ‘ఇది మన ఖర్మ కాదు.. మన అదృష్టం’ అన్న పేరుతో ఫ్లెక్సీలు కనిపించాయి.


అధైర్యపడకండి..

‘అధైర్యపడకండి.. ఎప్పుడూ మీకు అండగా ఉంటాం’ అని తెదేపా అధినేత చంద్రబాబు మహిళలకు ధైర్యం చెప్పారు. బుధవారం విజయరాయిలోని జంగాల కాలనీకి వెళ్లే మార్గంలో పలువురితో ఆయన మాట్లాడారు. తాళ్లూరి రమణ అనే మహిళ మాట్లాడుతూ.. కరోనా సమయంలో తన కుమార్తె ఆదిలక్ష్మి చనిపోయిందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, ఆమె పిల్లలిద్దరినీ తానే చూస్తున్నానని తెలిపారు. అదే వీధిలో కాటి వెంకటేశ్వరమ్మ ఇంటివద్ద ఒక ఎద్దే ఉండటం చూసి.. ఆ ఇంటికి వెళ్లి వివరాలు అడిగారు. మరో ఎద్దుకు వైరస్‌ సోకడంతో ప్రైవేటుగా వైద్యం చేయించామని, అయినా ఫలితం దక్కలేదని వెల్లడించారు. మరో ఎద్దును కొనేందుకు చంద్రబాబు ఆమెకు రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. మరికొందరు మహిళలు పిల్లలకు ఉద్యోగాల్లేవని, ధరలు పెరిగాయని, ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


ఎంత వరకైనా చదివించే బాధ్యత నాది

జంగారెడ్డిగూడెం, లింగపాలెం, న్యూస్‌టుడే: మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించే బాధ్యత తాను తీసుకుంటానని విద్యార్థులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలోని సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులతో మాట్లాడారు.

* ఫీజు రీయింబర్స్‌మెంటుపై ఆంక్షలతో పేద కుటుంబానికి చెందిన తాను పీజీ చేయలేకపోయానని, మీరు అధికారంలోకి వస్తే అందిస్తారా అని సాగరిక అనే విద్యార్థిని అడగ్గా ఆంక్షలు లేకుండా ఇస్తామని తెలిపారు.

* అధికారంలోకి వస్తే ఇంటర్మీడియట్‌ నుంచే విద్యార్థులకు నైపుణ్య శిక్షణను ప్రారంభిస్తామని  చెప్పారు.

* సాయంత్రం వరకు హుషారుగా ఉండటం వెనుక రహస్యం ఏమిటని నాగమణి అనే విద్యార్థిని అడగ్గా మనసును నియంత్రించగలిగితే ఏదైనా సాధించవచ్చని తెలిపారు.

* వ్యవసాయం లేనిదే పరిశ్రమలు ఉండవని, పరిశ్రమలు లేకుంటే ఏ వస్తువూ ఉండదని నాగ శిరీష ప్రశ్నకు సమాధానమిచ్చారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు