కమలం గూటికి ములాయం కోడలు

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలు రోజుకో ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. నిన్నమొన్నటివరకు అక్కడి భాజపా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తీర్థం పుచ్చుకుంటే, ఇప్పుడు

Published : 20 Jan 2022 05:37 IST

ఎస్పీకి భాజపా షాక్‌

ఎన్నికల బరిలోకి అపర్ణ

ఈనాడు, దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలు రోజుకో ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. నిన్నమొన్నటివరకు అక్కడి భాజపా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తీర్థం పుచ్చుకుంటే, ఇప్పుడు ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కోడలు అపర్ణా బిస్త్‌ యాదవ్‌ కాషాయ కండువా కప్పుకొన్నారు. ఉత్తరాఖండ్‌ రాజ్‌పుత్‌ కుటుంబానికి చెందిన ఆమె ములాయంసింగ్‌ రెండో భార్య సాధనా గుప్త కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ను వివాహమాడి అపర్ణా యాదవ్‌గా మారారు. బుధవారం దిల్లీ భాజపా ప్రధాన కార్యాలయంలో ఆమె కమలం పార్టీలో చేరారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి భాజపా కండువా వేసుకున్నారు. 2017లో లఖ్‌నవూ కంటోన్మెంట్‌ సీటు నుంచి పోటీచేసి ఓడిపోయినా 60 వేలకుపైగా ఓట్లు సాధించి అక్కడ గతంలో పోటీచేసిన ఎస్పీ అభ్యర్థులందరిలో ఎక్కువ ఓట్లు సాధించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈసారి అక్కడి నుంచే పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ తన కుటుంబం నుంచి ఎవరినీ ఎన్నికల గోదాలో దించకూడదని నిర్ణయించడం ఆమెకు శరాఘాతంగా మారింది.

అఖిలేశ్‌ పెత్తనంపై కినుక

అఖిలేశ్‌ పెత్తనం గురించి అపర్ణ కినుకతో ఉన్నారు. 2017 ఎన్నికల సమయంలో అఖిలేశ్‌ చిన్నాన్న శివపాల్‌ యాదవ్‌ ఆ పార్టీ నుంచి వైదొలగడం సంచలనం రేపింది. ఆయన కూడా త్వరలో కమలం గూటికి వస్తారని భాజపా నేతలు చెబుతున్నారు. అపర్ణ ఉదంతంతో ములాయం కుటుంబంలో విభేదాలున్నాయన్నది స్పష్టమయింది.  

భాజపాను అభినందిస్తున్నా: అఖిలేశ్‌

అపర్ణా యాదవ్‌ భాజపాలో చేరడం గురించి లఖ్‌నవూలో విలేకరులు అడిగిన ప్రశ్నకు అఖిలేశ్‌ యాదవ్‌ బదులిస్తూ- ‘‘మేం టికెట్లు ఇవ్వలేని వారికి భాజపా ఇస్తున్నందుకు వారికి అభినందనలు తెలుపుతున్నా. మా పార్టీ సైద్ధాంతికత విస్తరిస్తోంది’’ అని చమత్కారంగా సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని