ఏం నాయకా.. ఇంకో టికెట్‌ కావాలా!

ఎన్నికల్లో పార్టీ నాయకులకు ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ అన్న నిబంధనను అమలుచేయాలనుకున్న కాంగ్రెస్‌ అందుకు కొన్ని సడలింపులు ప్రతిపాదించింది. పార్టీని పూర్తిగా సంస్కరించాలని నేతలు ఆశిస్తున్న నేపథ్యంలో రాజస్థాన్‌లోని

Updated : 14 May 2022 06:11 IST

పార్టీలో 5 ఏళ్లు పని చేస్తే అందుకు అర్హులే
ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ షరతుకు మినహాయింపు
ఉదయ్‌పుర్‌ చింతన శిబిరంలో చర్చిస్తున్న కాంగ్రెస్‌

ఈనాడు, దిల్లీ: ఎన్నికల్లో పార్టీ నాయకులకు ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ అన్న నిబంధనను అమలుచేయాలనుకున్న కాంగ్రెస్‌ అందుకు కొన్ని సడలింపులు ప్రతిపాదించింది. పార్టీని పూర్తిగా సంస్కరించాలని నేతలు ఆశిస్తున్న నేపథ్యంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో నిర్వహిస్తున్న మేధోమథన సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో ఒకే కుటుంబం ఒకే టికెట్‌ వంటి కీలక ప్రతిపాదనలను కాంగ్రెస్‌ పరిశీలిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌ శుక్రవారం వెల్లడించారు. పార్టీలో కనీసం అయిదేళ్లు పని చేసిన వారికి ఈ షరతు వర్తించదని తెలిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల కమిటీ సభ్యుడైన ఆయన వ్యవస్థాగతంగా తీసుకురావాలనుకుంటున్న మార్పుల గురించి విలేకర్లకు వెల్లడించారు. ప్రస్తుతం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ రెండు దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్నారు. 2018 నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రియాంకా గాంధీకి 2024 ఎన్నికల నాటికి అయిదేళ్ల అర్హత వస్తుంది కాబట్టి ఆమెక్కూడా టిక్కెట్‌ ఇవ్వడానికి ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుటుంబానికి ఒకే టికెట్‌ ప్రతిపాదన రావడంతో సోనియా, రాహుల్‌, ప్రియాంక పరిస్థితి ఏమిటనే చర్చ మొదలైంది. అయితే, ఐదేళ్ల షరతు ఉన్నందున ఆ ముగ్గురికి టికెట్లు ఇవ్వడంలో ఇబ్బందేమీ ఎదురుకాబోదని స్పష్టమయ్యింది.

సంస్కరణల ప్రతిపాదనలివి..

* రాబోయే కాలంలో ఒక కుటుంబం, ఒకే టికెట్‌ విధానాన్ని అమలు చేయాలి. అయితే పార్టీలో 5 ఏళ్లకు మించి పనిచేసిన వారికి ఈ షరతు నుంచి మినహాయింపునివ్వాలి. పార్టీలోకి కొత్తగా  వచ్చిన వారికి వెంటనే టికెట్‌ ఇవ్వకూడదు.
* పోలింగ్‌ బూత్‌, బ్లాక్‌ యూనిట్‌ల మధ్యలో ప్రస్తుతం ఎలాంటి పార్టీ వ్యవస్థ లేదు. ఈ లోటును భర్తీచేయడానికి ప్రతి 15-20 పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ఒక మండల కమిటీని నియమించాలి. ప్రతి బ్లాక్‌ స్థాయిలో 3 నుంచి 5 వరకు మండల కమిటీలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి వీలవుతుంది.
* ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం సర్వేలు నిర్వహిస్తూ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాలు చేపట్టాలి. పార్టీలోనే అంతర్గతంగా ‘పబ్లిక్‌ ఇన్‌సైట్‌ డిపార్ట్‌మెంట్‌’ పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
* పార్టీలో నాయకులు, కార్యకర్తల పనితీరు మదింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
* పార్టీకి చెందిన ప్రతి కమిటీలో 50% మంది 50 ఏళ్ల వయసులోపు వారు ఉండేలా చూసుకోవాలి. బ్లాక్‌ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకు అన్ని కమిటీల్లో ఈ నిబంధన అమలు చేయాలి.
* పార్టీలో ఒకే పదవిలో 5 ఏళ్లకు మించి కొనసాగిన వారు ఆ పదవిని వీడాలి. ఆ తర్వాత వారికి మూడేళ్లు ఏ పదవీ ఇవ్వరాదు. ఒకే పదవిలో ఎవ్వరూ 5 ఏళ్లకు మించి కొనసాగకూడదు.

లీకుల భయం: ఫోన్లు బయటే

ఉదయ్‌పుర్‌లోని తాజ్‌ ఆరావళిలో జరుగుతున్న మూడు రోజుల కాంగ్రెస్‌ పార్టీ మేధోమథన సదస్సుకు 430 మంది నేతలు హాజరయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సోనియాగాంధీ ప్రసంగం పూర్తయిన వెంటనే సీడబ్ల్యూసీ ముందుగా నిర్దేశించిన అంశాలపై చర్చకు ఆరు బృందాలు విడి విడి హాళ్లలోకి వెళ్లిపోయాయి. ఆ బృందాల్లోని సభ్యులను మినహా ఇంకెవర్నీ ఆయా గదుల్లోకి అనుమతించలేదు. నేతలంతా ఫోన్లు వెలుపలే పెట్టాలని షరతు విధించారు. చర్చల మధ్యలోంచి ఎవరూ బయటికెళ్లిరాకుండానూ ఆంక్షలు విధించారు. ఆదివారం ఈ బృందాలు చర్చించి రూపొందించిన తీర్మానాలను సీడబ్ల్యూసీ ముందు పెట్టి ఆమోదించి ఉదయ్‌పుర్‌ డిక్లరేషన్‌ రూపంలో ప్రకటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని