Harish Rao: హామీలు అమలు చేయలేక.. మాపై విరుచుకుపడుతున్నారు: హరీశ్‌రావు

ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్‌ జాప్యం చేస్తోందని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 

Published : 04 Feb 2024 18:56 IST

హైదరాబాద్‌: ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ (Congress) జాప్యం చేస్తోందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. హామీల అమలుకు తేదీలు చెప్పింది కాంగ్రెస్‌ నేతలు కాదా? అని ప్రశ్నించారు. ఎల్బీనగర్‌లో నిర్వహించిన భారాస విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యాలపై స్పందించారు.

‘పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి అడిగే హక్కు సీఎం రేవంత్‌రెడ్డికి లేదు. తెదేపాలో ఉన్నప్పుడు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణకు అన్యాయం చేస్తూ రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తుంటే అసెంబ్లీని స్తంభింపజేసి పోరాడింది మా పార్టీ. నాడు.. మంత్రులుగా ఉన్న నేను, నాయిని నర్సింహారెడ్డి పదవులకు రాజీనామా చేసి నిరసన తెలియజేశాం. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగించేందుకు మేం అంగీకరించలేదు. రేవంత్‌ సర్కార్‌పై కేంద్రం ఒత్తిడి చేసింది. దీంతో వాళ్లే అంగీకరించారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగితే దిమ్మతిరిగే జవాబు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అసలు విభజన చట్టం బిల్లు పెట్టింది కాంగ్రెస్‌ కాదా? ఆ చట్టం తయారు చేసింది జైపాల్‌రెడ్డి, జైరామ్‌ రమేశ్‌ కాదా? తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వంద అబద్దాలు ఆడుతున్నారు. హామీలు అమలు చేయలేక మాపై విరుచుకుపడుతున్నారు. రేవంత్‌రెడ్డి విషయం లేక విషం చిమ్ముతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు, మూడు గంటలు కరెంట్‌ పోతోంది. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక కరెంటు కోతలు మరింత ఎక్కువవుతాయి. ఎన్నికల హామీలు అమలు చేశాకే ఓటు అడగాలి.’’అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని