Prashant Kishor: భాజపాను ఓడించాలంటే.. రెండో ఫ్రంట్‌గా అవతరించాల్సిందే..!

ఏ మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ భాజపాను గద్దె దించలేవని తాను భావిస్తున్నట్లు వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 30 Apr 2022 14:22 IST

ఎన్నికల వ్యూహకర్త పీకే కీలక వ్యాఖ్యలు

దిల్లీ: ఏ మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ భాజపాను గద్దె దించలేవని తాను భావిస్తున్నట్లు వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి విజయం సాధించాలంటే.. రెండో ఫ్రంట్‌గా అవతరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. 

2024 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ పార్టీ మూడో ఫ్రంట్‌గా రూపుదిద్దుకునేందుకు సహకరిస్తున్నారా..? అంటూ ఓ వార్త సంస్థ పీకేను ప్రశ్నించింది. దానిపై ఆయన సమాధానమిస్తూ.. ‘ఈ దేశంలో మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే దానిపై నాకు నమ్మకం లేదు. మనం భాజపాను మొదటి ఫ్రంట్‌గా పరిగణిస్తే.. దానిని ఓడించేందుకు రెండో ఫ్రంట్ కావాలి. ఏ పార్టీ అయినా భాజపాను ఓడించాలనుకుంటే.. అది రెండో ఫ్రంట్‌గా అవతరించాలి’ అంటూ వెల్లడించారు. ఆ వెంటనే కాంగ్రెస్‌ను రెండో ఫ్రంట్‌గా భావిస్తున్నారా..? అని అడగ్గా.. ఆయన లేదని బదులిచ్చారు. కాంగ్రెస్ దేశంలో రెండో అతిపెద్ద పార్టీ అని పేర్కొన్నారు.

ప్రతిసారి సార్వత్రిక ఎన్నికల ముందు మూడో ఫ్రంట్ ఏర్పాటు గురించి వార్తలు వినిపిస్తుంటాయి. దానిపై పలు పార్టీలకు చెందిన నేతలు చర్చలు జరుపుతుంటారు. కానీ తాము అనుకున్న ఫ్రంట్‌కు ఒక రూపం తీసుకువచ్చిన దాఖలాలు మాత్రం కనిపించవు. ఇక గత ఏడాది జరిగిన పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఓడించి, మమతా బెనర్జీ తిరిగి అధికారం కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె పార్టీ(తృణమూల్‌ కాంగ్రెస్) జాతీయ స్థాయి విస్తరణపై దృష్టి పెట్టారు. ఇటీవల గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని