Jaya Bachchan: ‘త్వరలో మీ బ్యాడ్‌ టైమ్‌ స్టార్ట్‌’.. భాజపాపై జయాబచ్చన్‌ కామెంట్స్‌!

భారతీయ జనతా పార్టీ సభ్యులపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన బిల్లుపై చర్చ సందర్భంగా భాజపాకు చెందిన ఎంపీ చేసిన వ్యక్తిగత విమర్శలపై ఘాటుగా స్పందించారు.

Updated : 21 Dec 2021 11:37 IST

దిల్లీ: భారతీయ జనతా పార్టీ సభ్యులపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన బిల్లుపై చర్చ సందర్భంగా భాజపాకు చెందిన ఎంపీ చేసిన వ్యక్తిగత విమర్శలపై ఘాటుగా స్పందించారు. ‘త్వరలో మీకు బ్యాడ్‌ టైమ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఇదే నా శాపం’ అంటూ జయా బచ్చన్‌ వ్యాఖ్యానించారు. రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నార్కోటిక్స్‌ బిల్లుపై మాట్లాడాలని జయాబచ్చన్‌కు రాజ్యసభ ఛైర్మన్‌ కుర్చీలో ఉన్న భువనేశ్వర్‌ కలితా కోరారు. అయితే, ఒక పార్టీకీ కొమ్ము కాసే విధంగా ఛైర్మన్‌ వ్యవహరించకూడదని, సభాపతి స్థానంలో కూర్చున్న వారు సభ్యులందరి పట్లా ఒకే రీతిన ఉండాలన్నారు.

దీనిపై భాజపా ఎంపీ రాకేశ్‌ సిన్హా పాయింట్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. సభాపతిని లక్ష్యంగా చేసుకుని జయాబచ్చన్‌ విమర్శలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అలా వారి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో జయాబచ్చన్‌ అధికార పక్ష సభ్యులు కూర్చున్న వైపు చూస్తూ ‘మీకు త్వరలోనే గడ్డుకాలం రాబోతోంది’ అంటూ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత దూషణలకు దిగిన ఎంపీపై చర్యలు తీసుకోవాలని జయాబచ్చన్‌ డిమాండ్‌ చేశారు. దీంతో సదరు సభ్యుడు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ పేర్కొన్నారు. అప్పటికీ వాగ్వాదం సద్దుమణగకపోవడంతో సభను సాయంత్రానికి రాజ్యసభ ఛైర్మన్‌ వాయిదా వేశారు. మరోవైపు పనామా పేపర్ల లీకేజీ కేసులో జయాబచ్చన్‌ కోడలు ఐశ్వర్యరాయ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరైన ఐశ్వర్య.. సుదీర్ఘ విచారణ అనంతరం సాయంత్రం బయటకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని