Rajagopalreddy: పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత ఇస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌ కొనసాగుతోంది. పార్టీలో కొందరు ముఖ్య నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పార్టీ

Published : 17 Mar 2022 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌ కొనసాగుతోంది. పార్టీలో కొందరు ముఖ్య నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత ఇస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘‘గౌరవం ఇవ్వని చోట ఉండలేను. ఎవరి కింద పడితే వారి కింద పని చేయను. తగిన వేదిక ద్వారా కేసీఆర్‌పై పోరాడుతా. పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తా. నన్ను నమ్మినవారు నా వెంట రావొచ్చు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటన రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తికి కారణమైంది. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరిట రూ.లక్షల కోట్లు అప్పులు చేసి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టారంటూ తెరాస సర్కారుపై రాజగోపాల్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందిస్తూ.. కోమటిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా రాజగోపాల్‌రెడ్డి తలసానిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో సభలో మాటల యుద్ధానికి దారితీసింది. ఈ విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనకు మద్దతుగా నిలవలేదని కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ‘‘మా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గట్టిగా నిలబడేది ఉండే. ఇద్దరు మాట్లాడిందీ తప్పు అన్నారు. ఏం లాభం నా మాటలు రికార్డుల నుంచి తొలగించారు.. వారివి అట్లే ఉంచారు. నా కోసం మా సభ్యులు గట్టిగా నిలబడి ఉంటే ఎంత బలం ఉండేది. భట్టి విషయంలో ప్రతీ అంశంలో అండగా ఉన్నాం... ఆయన మాత్రం మమ్మల్ని వదిలేశారు’’ అంటూ తన అసంతృప్తిని బుధవారం మీడియా ఎదుట వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలకు మరోసారి తెరలేచింది. గతంలో కూడా ఆయన పార్టీ మారతాననే సంకేతాలిచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోనే కొనసాగారు.

గతేడాది జనవరి 1న తిరుమలలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయ శక్తిగా భాజపా ఎదుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తాను భాజపాలో చేరే అవకాశముందని వెల్లడించారు. అప్పట్లో కోమటిరెడ్డికి తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ, ఆ తర్వాత పార్టీ మార్పు అంశం మరుగున పడింది. తాజాగా మొన్న అసెంబ్లీలో జరిగిన ఘటనతో రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తున్న భాజపా నేతలు గట్టి పట్టున్న నేతలను భాజపాలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి ఎపిసోడ్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని