Telangana News: పార్టీలోనే ఉంటా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మహేశ్వర్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు నిన్నటి నుంచి మీడియాలో తనపై కథనాలు రావడం బాధ కలిగించిందని..

Updated : 18 Aug 2022 18:40 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు నిన్నటి నుంచి మీడియాలో తనపై కథనాలు రావడం బాధ కలిగించిందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తా అని ఎక్కడా చెప్పలేదు. కానీ, రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో వచ్చింది. వెంటనే ఆ వార్తను ఖండించా. కాంగ్రెస్‌లోనే ఉంటానని బహిరంగంగా ప్రకటించా. రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. అలాంటి అవకాశం రాదు. మళ్లీ ఈరోజు కూడా ఏఐసీసీకి లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. నేను ఎప్పుడూ ఎవరిపై కంప్లైంట్‌ చేయలేదు. ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడే వ్యక్తిని. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి పార్టీ కోసం శాయశక్తులా కష్టపడుతున్నా. నిర్మల్‌లో రాహుల్‌గాంధీ పాదయాత్ర, ప్రజా చైతన్యయాత్ర, ఆదిలాబాద్‌లో మీటింగ్‌.. ఇలా ఎన్నో పెద్ద కార్యక్రమాలు చేశా. మిస్‌ కమ్యూనికేషన్‌తో తప్పుడు సమాచారం వెళ్లింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ నాకు మంచి మిత్రుడు. ఆయనతో ఎలాంటి విభేదాల్లేవు. నాకు కాంగ్రెస్‌ గౌరవం ఇచ్చింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారు. సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారు. ఆయన లేవనెత్తిన అంశాలు అధిష్ఠానం పరిష్కరిస్తుంది’’ అని మహేశ్వర్‌రెడ్డి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని