Congress: ముమ్మర ఏర్పాట్లు.. కాంగ్రెస్‌ చీఫ్‌గా ఖర్గే ప్రమాణం రేపే!

ఇటీవల జరిగిన ఏఐసీసీ(AICC) అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) కాంగ్రెస్‌ చీఫ్‌గా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Published : 26 Oct 2022 01:33 IST

దిల్లీ: ఇటీవల జరిగిన ఏఐసీసీ(AICC) అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) కాంగ్రెస్‌ చీఫ్‌గా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ.. తన బాధ్యతలను ఖర్గేకు అప్పగించనున్నారు. దీంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం లాన్‌లలో భద్రతా సిబ్బంది, పార్టీ కార్యకర్తలు  కార్యకర్తలు టెంట్‌ వేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని ఖర్గేకు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. 

అక్టోబర్‌ 17న జరిగిన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 9500 ఓట్లు పోల్‌ కాగా.. ఖర్గేకు 7897 ఓట్లు రాగా.. తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు 1072 మంది ఓటు వేసిన విషయం తెలిసిందే. భారీ మెజార్టీతో విజయం సాధించిన 80 ఏళ్ల మల్లిఖార్జున ఖర్గే..  24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పగ్గాలు అందుకొంటున్న గాంధీ కుటుంబేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

ఖర్గే ముందున్న సవాళ్లెన్నో..

కాంగ్రెస్‌ పార్టీ నూతన సారథిగా పగ్గాలు చేపట్టబోతున్నమల్లికార్జున ఖర్గేకు మున్ముందు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు ఆయనకు తొలి పరీక్షగా నిలవబోతున్నాయి. ఆ రెండుచోట్లా పార్టీకి పెద్దగా విజయావకాశాలు ఇప్పటికైతే కనిపించట్లేదు. రాజస్థాన్‌, కర్ణాటకల్లో అంతర్గత కుమ్ములాటలతో పార్టీ సతమతమవుతోంది. అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లే నేర్పు ఖర్గేలో ఉన్నా, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాల్లో ఐక్యత సాధించడం మాత్రం పెద్ద సవాలే‌. దేశంలో ప్రస్తుతం రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో 2023లో తన సొంత రాష్ట్రమైన కర్ణాటక సహా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని నడిపించే బాధ్యత ఖర్గేపైనే పడనుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఖర్గేని రిమోట్‌తో నియంత్రించేది సోనియాగాంధీ కుటుంబమేనని వస్తోన్న ఆరోపణల్ని తిప్పికొట్టేలా పనిచేయడం మరో ఎత్తు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని