‘దీదీ అహంవల్లే బెంగాల్‌ రైతులకు అన్యాయం’

పశ్చిమ బెంగాల్‌ రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరని అన్యాయం చేశారని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా ఆరోపించారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి మోదీ తీసుకొచ్చిన ‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి.......

Updated : 06 Feb 2021 16:36 IST

భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా

మాల్దా: పశ్చిమ బెంగాల్‌ రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరని అన్యాయం చేశారని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా ఆరోపించారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి మోదీ తీసుకొచ్చిన ‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకాన్ని పశ్చిమ బెంగాల్‌లో అమలు కాకుండా అడ్డుకున్నారన్నారు. కేవలం అహం, గర్వంతోనే ఆమె ఇలా చేశారని విమర్శించారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 70 లక్షల మంది రైతులు అన్యాయానికి గురయ్యారన్నారు. ఏడాదికి కేంద్రం ఇస్తున్న రూ.6000 ఆర్థిక సాయాన్ని కోల్పోయారన్నారు. బెంగాల్‌లో నెల రోజుల పాటు భాజపా చేపట్టిన ‘క్రిషక్‌ సురక్షా అభియాన్‌ యోజన’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శనివారం ఈ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

బెంగాల్‌లో దాదాపు 25 లక్షల మంది రైతులు తమ రాష్ట్రానికీ పీఎం కిసాన్‌ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారని నడ్డా తెలిపారు. దీంతో అప్రమత్తమైన మమతా బెనర్జీ.. పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ముందుకు వచ్చారన్నారు. అయితే, ఎన్నికలు సమీపించినందునే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారని ఆరోపించారు. సమయం మించిపోయిందని.. ప్రజలు వారికి జరిగిన అన్యాయాన్ని గుర్తించారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ సర్కార్‌కు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. దీన్ని మమతా బెనర్జీ గుర్తించి నడుచుకోవాలని హితవు పలికారు. వివిధ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున బెంగాల్‌కు చేకూరిన లబ్ధిని ఈ సందర్భంగా నడ్డా వివరించారు. అనంతరం మాల్దా గ్రామంలో రైతులతో కలిసి ఆయన భోజనం చేశారు.

ఇవీ చదవండి...

కరోనా:భారత్‌ను ప్రశంసించిన డబ్ల్యూహెచ్‌ఓ

సంయమనం పాటించండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని