Manipur polls: మణిపుర్ తొలి విడత ఎన్నికలు పూర్తి.. 78% ఓటింగ్

స్వల్ప ఉద్రిక్త ఘటనల మధ్య మణిపుర్‌ శాసనసభ ఎన్నికల తొలివిడత ఎన్నికలు ముగిశాయి. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపుర్​లో తొలివిడతలో భాగంగా.......

Published : 28 Feb 2022 21:38 IST

ఇంఫాల్‌: స్వల్ప ఉద్రిక్త ఘటనల మధ్య మణిపుర్‌ శాసనసభ ఎన్నికల తొలివిడత ఎన్నికలు ముగిశాయి. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపుర్​లో తొలివిడతలో భాగంగా సోమవారం 38 స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. 5జిల్లాల పరిధిలో మొత్తం 1,721 పోలింగ్​ కేంద్రాల్లో పోలింగ్‌​ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  78.03శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. కాంగ్‌పోక్పి జిల్లాలో అత్యధికంగా.. 82.79 శాతం పోలింగ్‌​ నమోదైంది.  82.19శాతం ఓట్లతో ఇంఫాల్‌ వెస్ట్‌ రెండో స్థానంలో నిలిచింది.

మణిపుర్‌ తొలి విడత ఎన్నికల్లో 173 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. వీరిలో 15 మంది మహిళలు ఉన్నారు. ముఖ్యమంత్రి.. బీరేన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి యుంనమ్ జోయ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు లోకేశ్ సింగ్ తొలి విడత బరిలో ఉన్నారు. సీఎం బీరేన్‌ సింగ్‌ హింగాంగ్‌లో ఓటు వేయగా, గవర్నర్‌ గణేశన్‌.. సగోల్‌ బంద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటింగ్‌ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. చురాచాంద్‌పుర్‌లో కాంగ్రెస్‌, భాజపా శ్రేణులు ఘర్షణకు దిగగా, ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. కాక్వా, కీరో ప్రాంతాల్లో కూడా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కాంగ్​కోక్పి నియోజకవర్గం, కైతెల్మండి ప్రాంతంలోని పోలింగ్​ బూత్​లో ఈవీఎంలను కొందరు ధ్వంసం చేయగా పోలింగ్​ నిలిపివేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తర్వాత మళ్లీ ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ఘటనలో పలువురిని అరెస్ట్​ చేసినట్లు పేర్కొంది. కాగా రెండో విడత పోలింగ్ మార్చి 5న జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని