Telangana News: ఈడీ నోటీసు ఆశ్చర్యంగా.. విచిత్రంగా ఉంది: ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని, న్యాయవాదులతో చర్చించి  తగిన సమాధానం ఇస్తానని రోహిత్‌రెడ్డి తెలిపారు. 

Published : 17 Dec 2022 01:51 IST

హైదరాబాద్‌: తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్‌ చట్టం కింద నోటీసులు జారీ చేసిన అధికారులు ఈనెల 19న ఉదయం 10గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలకు ఎర వేసిన భాజపా బండారం బయటపెట్టినందుకే కక్షపూరితంగా ఈడీ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. 

‘‘ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసు ఆశ్చర్యంగా... విచిత్రంగా ఉంది. నోటీసులో నా బయోడేటా అడగటం హాస్యాస్పదం. నాకు నోటీసు వస్తుందని ముందే ఎలా తెలుసో బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి. భాజపా బండారం బయటపెట్టినందుకే కక్షపూరితంగా నాకు ఈడీ నోటీసు ఇచ్చారు. అయినా, తగ్గేది లేదు..భయపడేది లేదు. న్యాయవాదులతో చర్చించి నోటీసుపై తగిన సమాధానం ఇస్తా. ఈడీ నోటీసుపై బండి సంజయ్‌కి ముందే ఎలా తెలుసో సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి. దీనిపై కోర్టును ఆశ్రయిస్తా. బెంగళూరు డ్రగ్స్‌ కేసులో నాకు నోటీసు ఎప్పుడు వచ్చిందో బండి సంజయ్‌ చెప్పాలి. అయ్యప్పమాలతో నేను యాదగిరిగుట్ట వస్తా.. తడి బట్టలతో బండి సంజయ్‌ రావాలి. బీఎల్‌ సంతోష్‌ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు రావడం లేదు. నీతిమంతులైతే బీఎల్‌ సంతోష్‌, తుషార్‌ విచారణకు రావాలి’’ అని రోహిత్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని