PM Modi: కేసీఆర్‌ ఎన్డీయేలో చేరతామన్నారు: మోదీ

రానున్న ఎన్నికల్లో తెలంగాణ తల్ల్లులు, చెల్లెమ్మలు ఓట్ల రూపంలో భాజపాను ఆశీర్వదించాలని ప్రధాని మోదీ కోరారు.

Updated : 03 Oct 2023 18:40 IST

ఇందూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ వైఖరి పూర్తిగా మారిపోయిందన్నారు. కేసీఆర్‌ దిల్లీ వచ్చి తనను కలిశారని, ఎన్డీయేలో చేరతామని, తెలంగాణలో కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరినట్లు చెప్పారు. అయితే, ఇది రాజరికం కాదని చెబుతూ, భారాసతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ రోజే తేల్చి చెప్పినట్లు మోదీ వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. ఇందూరు గిరిరాజ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన భాజపా జనగర్జన సభలో ప్రసంగించారు.

ఓ రహస్యం ఇవాళ మీకు చెబుతున్నా..

‘‘ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ రహస్యం ఇవాళ మీకు చెబుతున్నా. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ వైఖరి పూర్తిగా మారిపోయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ దిల్లీ వచ్చి నన్ను కలిశారు. నాపై ఎంతో ప్రేమ ఒలకబోశారు. కేసీఆర్‌ గతంలో ఎన్నడూ అంత ప్రేమ చూపలేదు. అది ఆయన వ్యక్తిత్వంలోనే లేదు. నా నేతృత్వంలోనే దేశం దూసుకుపోతోందని కేసీఆర్‌ భజన చేశారు. తెలంగాణ పాలనా పగ్గాలు కేటీఆర్‌కు ఇస్తానని చెప్పారు. ఆయన్ను ఆశీర్వదించాలని కోరారు. ఇది రాజరికం కాదని నేను కేసీఆర్‌కు గట్టిగా చెప్పా. ప్రజలు ఆశీర్వదించిన వారే పాలకులని, భారాసతో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పాను. జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికల్లో మద్దతివ్వాలని అడిగారు. విపక్షంలోనైనా కూర్చుంటాం కానీ, మద్దతు ఇవ్వనని తెగేసి చెప్పాను. తెలంగాణ ప్రజలకు ద్రోహం చెయ్యనని కేసీఆర్‌కు స్పష్టం చేశాను. కేసీఆర్‌ కోరినా.. భారాస ఎన్డీయేలో చేరేందుకు నేను అంగీకరించలేదు’’ అని మోదీ అన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంది..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరఫున గట్టిగా పోరాడాలని భాజపా నిర్ణయించిందని మోదీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఆస్పత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారమైందన్న మోదీ.. రాష్ట్ర ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. ప్రజాస్వామ్య కుటుంబాన్ని భారాస కుటుంబ స్వామ్యంగా మార్చిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు భాజపాను ఆశీర్వదించాలని ప్రధాని మోదీ కోరారు.

కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దు..

కొన్ని రోజుల క్రితమే మహిళా రిజర్వేషన్ల బిల్లు రూపొందించుకున్నట్లు గుర్తు చేసిన ఆయన.. భరతమాత రూపంలో సభకు వచ్చిన మహిళలకు అభినందనలు తెలిపారు. ‘‘మహిళలు పెద్ద సంఖ్యలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్‌లో మరింత మహిళా శక్తిని మనం చూడనున్నాం. తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు ఓట్ల రూపంలో భాజపాను ఆశీర్వదించాలి. తెలంగాణ ప్రజల్లో ఎంతో శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయి. ప్రపంచానికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించిన ఘనత తెలంగాణదే’’ అని మోదీ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందని, కేసీఆర్‌, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు. తెలంగాణ యువత కుటుంబ పాలనకకు మరో అవకాశం ఇవ్వొద్దని మోదీ పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని