మద్యం మహమ్మారికి ‘జగన్‌ ముద్దులు’

‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు.

Updated : 07 May 2024 06:51 IST

‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులకు చేసిన వాగ్దానాన్ని వాగులో కలిపేసి, లిక్కర్‌ విక్రయాల ద్వారా వచ్చిపడే నెత్తుటికూటికి జగన్‌ తెగ లొట్టలేశారు. మద్యాన్ని నిషేధించకుండా ఓట్లు అడగనని సత్యహరిశ్చంద్రుడిలా ప్రమాణం చేసిన జగన్‌ - అసలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జనంలోకి వస్తున్నారు?

శ్రీమాన్‌ మద్య మహాన్‌ జగన్‌!

మంచివాడిలా నటించడం, నమ్మించి నట్టేట్లో ముంచడం, ఏమీ ఎరగనట్టు మళ్లీ సుద్దపూస మాటలు చెప్పడం... ఇవి జగన్‌ సహజ లక్షణాలు. ‘‘ప్రజలతో విచ్చలవిడిగా తాగించి ఆదాయం పెంచుకోవాలనే ప్రభుత్వ ఆలోచన దారుణంగా ఉంది’’ అంటూ ప్రతిపక్ష నేతగా జగన్‌ చెప్పిన నీతులు- సుమతీ శతకకర్త కూడా చెప్పలేదు. అలా జనాన్ని ఏమార్చి ఓట్లు వేయించుకున్న ఆయన- సీఎం అయ్యాక పరమ అనైతికంగా మాట్లాడారు. ఏపీలో అమ్ముతున్న మద్యంలో ప్రమాదకర విషపదార్థాలు ఉంటున్నాయనే గగ్గోలు రేగినప్పుడు ప్రతిపక్షంపై జగన్‌ తాడెత్తున లేచారు. ‘‘రాష్ట్రానికి లిక్కర్‌ ద్వారా ఆదాయం రాకూడదని... అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవాలనే దుర్బుద్ధితో దురాలోచనతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని అసెంబ్లీలోనే ఆడిపోసుకున్నారు. మద్యం ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావడమంటే- జనానికి తాగబోయించి, వారి కష్టార్జితాన్ని ప్రభుత్వం కాజేయడం. తండ్రులు, భర్తలు, కొడుకులు తాగి తాగి ఆరోగ్యాలను పాడుచేసుకుంటుంటే, తమను కొడుతుంటే ఏమీ చేయలేక ఆడపడుచులు ఏడుస్తూ కూర్చోవడం. అలా కుటుంబాలను సర్వనాశనం చేసి సొమ్ములు సంపాదించాలనుకునే సర్కారును బుద్ధున్నవారు ఎవరైనా ఛీత్కరిస్తారు. కానీ, రక్తపిపాసే తప్ప ప్రజల బాగోగుల పట్ల బాధ లేని జగన్‌- లిక్కర్‌ ఆదాయం రాకపోతే ఎలాగని గుండెలు బాదుకున్నారు. మద్యనిషేధం హామీని నిలబెట్టుకోరేమిటని ప్రశ్నించిన ప్రతిపక్షాలు, పత్రికలను పడతిట్టిపోసి మరీ ఆయన జనం రక్తమాంసాలతో వ్యాపారం చేశారు.

‘అక్కాచెల్లెమ్మ’లను మోసంచేసిన జగన్‌

‘‘ప్రతి అడుగు మద్య నియంత్రణ వేస్తున్నాం’’ అని నిండు శాసనసభలో తన బాకా తానే ఊదుకున్నారు జగన్‌. అదే పెద్దమనిషి మద్యాదాయాన్ని తాకట్టు పెట్టి సుమారు రూ.50వేల కోట్లు అప్పులు తెచ్చారు. ప్రజలు అసహ్యించుకుంటున్నా, రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం హెచ్చరిస్తున్నా సరే- లెక్క చేయకుండా ఆ రుణాలను సేకరించారు జగన్‌. వాటిని తిరిగి తీర్చాలంటే- జనాన్ని వీలైనంతగా మద్యం మత్తులో ముంచేయాలి. ఇదీ... రాష్ట్రానికి జగన్‌ చేసిన మహామేలు! ఇక బెల్టుషాపులను కట్టడిచేశామన్న అయ్యవారి మాటలూ కల్లబొల్లి కబుర్లే. జగన్‌ భక్తుల అండదండలతో ఊళ్లలో బెల్టుషాపులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కల్తీ సారాక్షసుల కూసాలు విరగ్గొట్టడంలోనూ జగన్‌ది దారుణ విఫల చరిత్రే. జంగారెడ్డిగూడెంలో సారా తాగి చాలామంది కడతేరిపోతే- ‘‘వాళ్ల మటుకు వాళ్లే చనిపోయారు’’ అని జగన్‌ సర్కారు నాలుక చప్పరించేసింది. నాటుసారా కారణంగా అయినవారిని కోల్పోతున్నామని ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కర్నూలు జిల్లా మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. చదువుకునే పిల్లలనూ చెడగొడుతున్న సారా అమ్మకాలను అరికట్టాలంటూ ఎక్సైజ్‌ మంత్రి నియోజకవర్గంలోనే దళిత మహిళలు ధర్నాకు దిగారు. గ్రామం మధ్యలో మద్యం దుకాణం పెట్టి తమకు రక్షణ లేకుండా చేశారని తిరుపతి జిల్లాలోనూ సాధారణ మహిళలు రోడ్డెక్కారు. లిక్కర్‌ రాబడి మత్తులోనే మునిగిపోయిన జగన్‌- తనను నమ్మి ఓట్లేసిన మహిళలను నిలువునా మోసంచేశారు. ‘నా అక్కాచెల్లెమ్మలు’ అంటూనే ఆడపడుచుల బతుకులను మద్యం రక్కసికి బలిచేశారు.

అయినవారి మందు... కమిషన్ల విందు!

జగన్‌ సీఎం కాగానే ప్రైవేటు దుకాణాలను మూసేయించి- సర్కారీ లిక్కర్‌ షాపులను తెరిచారు. వైకాపా పెద్ద తలకాయకు కాసుల నైవేద్యం సమర్పించుకున్న కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయన్న విమర్శలు బలంగా ఉన్నాయి. అలా కమిషన్ల రూపంలో ఏడాదికి రూ.1500 కోట్లు ఆ అవినీతి జగత్‌ కిలాడీ కడుపులోకి పోయినట్లు చెబుతారు. ఆ విధంగా డబ్బులిచ్చిన సంస్థలతో పాటు వైకాపా కీలక నేతల సన్నిహితులకు చెందిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లను అత్యధికంగా కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక జగన్‌ ప్రభుత్వ దుకాణాల్లో అమ్మే బ్రాండ్లలో చాలావరకు ‘ప్రత్యేకమైనవి’! మరెక్కడా కనిపించనవి, వినియోగదారులకు ఏమాత్రం నచ్చనవి. జగన్‌ పార్టీ జాన్‌జిగ్రీ దోస్తులవి కాబట్టే వాటికి ఏపీలో ఎర్రతివాచీ పరిచారన్నది బహిరంగ రహస్యం. ఇక దేశమంతా డిజిటల్‌ చెల్లింపుల బాటపట్టినా సరే, జగన్‌  ప్రభుత్వ లిక్కర్‌ షాపుల్లో చాలాకాలం వాటిని అసలు ఒప్పుకోలేదు. రాష్ట్రంలో మద్యం తయారీ, సరఫరా అంతా జగన్‌ అనుచరులు, వైకాపా ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోందని కేంద్ర అధికారపక్షం భాజపా ఆరోపించింది. మద్యం విక్రయాలతో వస్తున్న ఆదాయాన్ని అధికారిక లెక్కల్లో తక్కువగా చూపించి, వేలాది కోట్ల రూపాయలను జగన్‌ పార్టీ దోచేస్తోందనీ బీజేపీ నేతలు గళమెత్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లలో మద్యం కుంభకోణాల పుట్టలు పగిలాయి. ఈడీ, సీబీఐలు ఏపీ వైపూ దృష్టిసారిస్తే- ఆ రెండు రాష్ట్రాలకు మించిన దోపిడీ భాగోతాలు ఇక్కడ బట్టబయలవుతాయి ఏమో!

ఇల్లూ ఒళ్లూ గుల్లచేసి...

రాష్ట్ర ఆదాయం పెరగాలంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలి. పరిశ్రమలు, వ్యాపార సంస్థలను తీసుకురావాలి. మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. ఇవన్నీ చేయడానికి జగన్‌కు మనసు రాలేదు. కానీ, లిక్కర్‌ విక్రయాలతో విచ్చలవిడిగా  కాసులు కొల్లగొట్టడానికి  మాత్రం ఆయనకు చేతులొచ్చాయి. పైపెచ్చు మద్యాదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకోవడం- జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు సిగ్గుమాలినతనానికి పరాకాష్ట. అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి పథకాల అమలు బాధ్యతలను లిక్కర్‌ వ్యాపారం చేసే ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ చేతుల్లో పెట్టారు జగన్‌. మద్యాన్ని విక్రయించగా వచ్చే సొమ్ముతో ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాలను పరిరక్షిస్తామనీ ఆయన ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. అదేమన్నా రాష్ట్రాన్ని ఉద్ధరించే మంచిపనా? జనం తాగి తాగి ఇల్లు, ఒళ్లు గుల్లచేసుకుని మరీ జగన్‌ గల్లాపెట్టెలు నింపితే- అప్పుడు ఆయనగారు తీరిగ్గా బటన్లు నొక్కి ‘సంక్షేమ ప్రభువు’గా పోజులు కొడతారన్న మాట! ఎంత దుర్మార్గమిది! మద్యనిషేధం పేరిట మురిపించి జగన్‌ అధికారంలోకి వచ్చారు. అంతేతప్ప- ఆడపడుచుల తాళిబొట్లు తెంపే లిక్కర్‌ను అమ్మి, డబ్బులు సంపాదించి, వాటితో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పలేదు. అలా అప్పుడే చెప్పి ఉంటే- ఎక్కడికక్కడ చెప్పులదండలతో వైకాపా మందలను సన్మానించి ఉండేవారేమో మహిళలు. సంక్షేమ పాలన అంటే జనజీవన ప్రమాణాలను పెంచడం. మందు పోసి మత్తులో ముంచి జనం జేబులకు కన్నాలేయడం కాదు. కానీ, స్వార్థ ప్రయోజనాలకోసం జగన్‌ అదే పనిచేశారు... నాసిరకం మద్యాన్ని ఏరులై పారించి సామాన్యులను జబ్బుల పాల్జేశారు. అంత చేసి మళ్లీ తాను పేదల పక్షపాతినని చెప్పుకోవడం ఉంది చూశారూ- అబ్బో! ఆస్కార్‌ స్థాయిని మించిపోయిన అతిజుగుప్సాకర నటన అది!!

మద్యంపై రూ.లక్ష కోట్ల రాబడి

‘‘మా ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తాం’’ అని విపక్షనేతగా జనానికి మాటిచ్చారు జగన్‌. మద్యపాన నిషేధాన్ని మూడు దశల్లో అమలుచేస్తానని, స్టార్‌ హోటళ్లలో మాత్రమే మందు దొరికే విధంగా చూస్తానని ఢంకా బజాయించి చెప్పారు. పదవిలోకి వచ్చాకేమో మద్యం రక్కసిని మహదానందంగా చంకనెక్కించుకున్నారు. లిక్కర్‌ విక్రయాల విలువను ఏడాదికేడాది పెంచేశారు. రాష్ట్రంలోని 2,934 మద్యం దుకాణాలన్నీ రాబోయే సెప్టెంబరు 30వరకు అలాగే కొనసాగుతాయంటూ కొద్ది నెలల క్రితమే కొత్త ఎక్సైజ్‌ పాలసీని తీసుకొచ్చారు. పర్యాటక ప్రదేశాల్లో లిక్కర్‌ అవుట్‌లెట్లు, వాకిన్‌ షాపుల ఏర్పాటుకూ జగన్‌ సై అన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్రంలో 840 బార్లు ఉండేవి. దశల వారీ మద్యనిషేధంలో భాగంగా ఇప్పటికల్లా బార్లన్నీ అదృశ్యమై ఉండాలి కదా. కానీ, జగన్‌ మాట తప్పి బార్లకు హారతులు పట్టారు. 2022లో 838 బార్లకు వేలంపాటలు పెట్టి, 2025 ఆగస్టు 31వరకు లైసెన్సులు ఇచ్చేశారు. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో అంతకు ముందు బార్లు లేని చోట్లా వాటి ఏర్పాటుకు వీలుగా నిబంధనలను మార్చారు. ధరలు పెంచి లిక్కర్‌ వినియోగాన్ని తగ్గిస్తామన్న ఆయన-
సీఎం అయిన మొదట్లో భారీగా రేట్లు పెంచారు. ఆ తరవాత మళ్లీ తగ్గించారు. అలా ఏవో కొన్ని నాటకాలాడారే కానీ, లిక్కర్‌ విక్రయాల నియంత్రణ పట్ల జగన్‌ చిత్తశుద్ధి సున్నా! ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొన్న
జనవరి 15వరకు రూ.1.15 లక్షల కోట్ల విలువైన మద్యాన్ని అమ్మించారాయన. వాటి ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని వెనకేసుకున్నారు. మద్యావతార మహాప్రభువు జగన్‌ గొప్పతనమిది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని