మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక

మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది.

Updated : 07 May 2024 06:54 IST

నేడు ప్రాజెక్టును సందర్శించనున్న కాళేశ్వరం కమిషన్‌ ఛైర్మన్‌

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఈ బ్యారేజీలను పరిశీలించడంతోపాటు నీటిపారుదల శాఖ అధికారులు, ఏజెన్సీలతో చర్చించింది. పూర్తి నివేదిక రావడానికి సమయం పట్టే అవకాశం ఉండడం.. వర్షాకాలంలోగా తాత్కాలిక మరమ్మతులు చేయకపోతే బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లే పరిస్థితి నేపథ్యంలో మొదట మధ్యంతర నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ కోరింది. దీనికి అనుగుణంగా అయ్యర్‌ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సిఫార్సులతో మధ్యంతర నివేదికను ఎన్డీఎస్‌ఏ ఛైర్మన్‌.. రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శికి పంపినట్లు తెలిసింది. తాత్కాలికంగా చేపట్టాల్సిన పనులతోపాటు తదుపరి ఎలాంటి పరీక్షలు చేపట్టాలో కూడా ఇందులో పేర్కొన్నట్లు తెలిసింది. మేడిగడ్డలో ఏడో బ్లాక్‌కు మాత్రమే నష్టం వాటిల్లిందా, మిగిలిన బ్లాకుల పరిస్థితి ఏంటన్నది తెలుసుకోవడానికి పలు పరీక్షలు (ఇన్వెస్టిగేషన్స్‌) సూచించినట్లు సమాచారం. తుది నివేదికను జూన్‌లో అందజేస్తారని నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

అధికారులతో జస్టిస్‌ పీసీ ఘోష్‌ భేటీ 

కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తునకు ఏర్పాటైన జ్యుడిషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. మంగళవారం రాత్రి రామగుండంలోనే ఆయన బస చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం కోల్‌కతా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఛైర్మన్‌.. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. విచారణ ప్రక్రియకు సంబంధించిన అంశాలతో పాటు, మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ పర్యటన తర్వాత ఎన్డీఎస్‌ఏ మధ్యంతర నివేదికపై చర్చించి తదుపరి చర్యలపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది.

కమిషన్‌కు సాంకేతిక సహకార బృందం

కమిషన్‌కు సాంకేతిక సహకారం అందించేందుకు ఇద్దరు ఇంజినీర్లతో ఒక బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతలతో సంబంధం లేని సీఈ విజయభాస్కర్‌రెడ్డి, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్‌లను బృందంలో నియమించినట్లు సమాచారం. కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా హైకోర్టు విశ్రాంత రిజిస్ట్రార్‌ మురళీధర్‌ను నియమించినట్లు తెలిసింది. మరో ఇద్దరు న్యాయవాదులను కూడా తీసుకోనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని