Janasena: వైకాపా ఎంపీ భవంతికి వాస్తు దోషం ఉంటే రోడ్డును మూసేస్తారా?: నాదెండ్ల

విశాఖ వైకాపా ఎంపీ నిర్మిస్తోన్న రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుకి వాస్తుదోషం ఉందని ప్రజలు నడిచే దారిని మూసేయడం దుర్మార్గమైన చర్య అని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు.

Updated : 09 Dec 2023 18:36 IST

విశాఖపట్నం: విశాఖ వైకాపా ఎంపీ నిర్మిస్తోన్న రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుకి వాస్తుదోషం ఉందని ప్రజలు నడిచే దారిని మూసేయడం దుర్మార్గమైన చర్య అని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. విశాఖలో టైకూన్‌ కూడలిని మూసేసి మరీ ప్రజాప్రతినిధి భవనానికి అధికారులు సహకరించడం ఘోర తప్పిదమన్నారు. ప్రజా సమస్యపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నాయకులను పోలీసులు అడ్డగోలుగా రోడ్డుపై ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం పైశాచిక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్నంలోని టైకూన్‌ జంక్షన్‌లో వైకాపా ఎంపీ నిర్మిస్తున్న అతిపెద్ద భవంతికి వాస్తు దోషం పేరిట అక్కడున్న ప్రధాన మార్గాన్ని మూసివేయడం పట్ల శనివారం విశాఖ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు టైకూన్‌ జంక్షన్‌లో నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. జనసేన నాయకులు, వీర మహిళల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించి త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న నాదెండ్ల మనోహర్‌ స్పందించారు. త్రీటౌన్‌ స్టేషన్‌కు స్వయంగా వెళ్లి అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పైనుంచి చెప్పారని అరెస్టు చేస్తారా?

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ భూదందాలపై వచ్చే ప్రభుత్వంలో సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా, రోడ్డుపై మహిళలను ఈడ్చిపడేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు లేదా? అని ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ప్రతిపక్షాల బాధ్యత అని స్టేషన్‌లో ఉన్న పోలీసు అధికారికి వివరించారు. ఏం తప్పు చేశారని జనసేన నాయకులను అరెస్టు చేశారో వివరణ ఇవ్వాలని కోరారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు అంటూ పోలీసులు చెప్పడం పట్ల నాదెండ్ల మనోహర్‌ విస్మయం వ్యక్తం చేశారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారులే పైనుంచి వచ్చిన ఆదేశాలు అని చెప్పి అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. వెంటనే నాయకులను విడుదల చేయాలని కోరారు.

‘‘వారాహి విజయ యాత్రలో భాగంగా విశాఖపట్నం వచ్చిన సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ టైకూన్ జంక్షన్‌లో వివాదాస్పద సీఎన్‌బీసీ మిషనరీ భూముల్లో ఎంపీ నిర్మిస్తున్న అతి పెద్ద భవంతిని, ఆ భూముల్లో జరిగిన అవకతవకలను స్వయంగా పరిశీలించారు. ఆ సమయంలోనే కీలకమైన టైకూన్ కూడలి నుంచి వీఐపీ రోడ్డుకు వెళ్లే మార్గాన్ని ఎంపీ నిర్మిస్తున్న భవనానికి రోడ్డు పోటు అంటూ అధికారులు మూసివేశారని పవన్ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. విశాఖ నగర ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ మార్గాన్ని వెంటనే తెరిచి, ఫ్లైఓవర్‌ వరకూ వెళ్లి రావాల్సిన బాధను తప్పించాలని, దీనివల్ల రెండు కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారులకు అప్పుడే పవన్‌ కల్యాణ్‌ విన్నవించారు.

టైకూన్ జంక్షన్ మూసివేతతో లబ్ధి పొందే అదృశ్య శక్తి ఎవరు?

టైకూన్‌ జంక్షన్‌ మూసివేతపై పవన్‌ కల్యాణ్‌ స్పందించిన అనంతరం విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా అధికారులకు వినతిపత్రం ఇచ్చినట్టు హడావుడి చేశారు. ఆ తర్వాత నగరపాలక అధికారులు, పోలీసు అధికారులు దీనిపై స్పందించలేదు. ఇప్పటికీ ఆ సమస్య అలాగే ఉంది. ఇంత కీలమైన సమస్యపై జనసేన నాయకులు పోరాడుతుంటే పోలీసులు అనుచితంగా వ్యవహరించడం భావ్యం కాదు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి, జనసేన నాయకులపై ఇష్టారీతిన ప్రవర్తించాలని చెప్పిన పై వ్యక్తులు ఎవరో బయటపెట్టాలి. ఆ అదృశ్య శక్తుల పేర్లను పోలీసులే వెల్లడించాలి. టైకూన్‌ కూడలి మూసివేతతో లబ్ధి పొందే అదృశ్య శక్తి ఎవరో తెలియాలి. ఆ ప్రాజెక్టుకి సంబంధించి టీడీఆర్ పేరుతో రూ.63 కోట్లు కొట్టేశారు. విశాఖపట్నంలో భూ దందాలను బయటపెట్టడమే కాదు.. ప్రజలు ఇబ్బందిపడే ప్రతి సమస్యపైనా జనసేన పోరాడుతుంది. 

విశాఖ భూ దందాలపై ప్రజలకు జవాబు చెప్పాలి

విశాఖలో జరిగిన భూ దోపిడీలను జనసేన-తెదేపా ప్రభుత్వంలో బయటపెట్టి నిందితులను చట్టానికి అప్పగిస్తాం. 100 రోజుల్లో ప్రభుత్వం మారబోతోంది. విశాఖను అత్యంత సుందరంగా, అభివృద్ధికి మార్గదర్శిగా మార్చే బాధ్యతను తీసుకుంటాం. విశాఖలో జరిగిన భూ దందాల వెనుక ఉన్న ప్రతి నాయకుడు వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు జవాబు చెప్పాల్సిందే’’ అని నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మనోహర్‌ వెంట భారీగా జనసేన నాయకులు, వీర మహిళలు పోలీస్‌ స్టేషన్‌కు తరలివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు