Telangana News: అక్రమాలకు అడ్డాగా ప్రగతి భవన్‌: ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

సీబీఐ, ఈడీ, ఏసీబీ నోటీసులు అందుకున్న వారు, తప్పు చేసిన వారు, టెండర్లు కావాలనుకునే వారు, అక్రమాలు చేయాలనుకునేవారు, టర్మినేట్‌ అయిన అధికారులు, భూ దందాలు, ల్యాండ్‌, శాండ్‌ మాఫియాకి ప్రగతిభవన్‌ కేంద్రంగా మారిందని భాజపా సీనియర్‌ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ విమర్శించారు.

Published : 04 Dec 2022 17:50 IST

హైదరాబాద్‌: ప్రగతి భవన్‌ అక్రమాలకు అడ్డాగా మారిందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీబీఐ, ఈడీ, ఏసీబీ నోటీసులు అందుకున్న వారు, తప్పు చేసిన వారు, టెండర్లు కావాలనుకునే వారు, అక్రమాలు చేయాలనుకునేవారు, టర్మినేట్‌ అయిన అధికారులు, భూ దందాలు, ల్యాండ్‌, శాండ్‌ మాఫియాకి ప్రగతిభవన్‌ కేంద్రంగా మారిందని విమర్శించారు.

‘‘గ్రానైట్‌ కంపెనీలకు సంబంధించి నోటీసులు అందుకున్న వ్యక్తులు సీఎం కేసీఆర్‌తో కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలనే చర్చలు జరిపేందుకు ప్రగతిభవన్‌ వినియోగిస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ఎమ్మెల్యేలకు ఎర విషయంలో నలుగురు ఎమ్మెల్యేలు 20 రోజుల పాటు ప్రగతి భవన్‌లోనే దాక్కున్నారు. సీబీఐ నోటీసులు అందుకున్న ఓ మహిళ భవిష్యత్‌ కార్యాచరణపై అనేక నిర్ణయాలు తీసుకునే నిలయంగా ప్రగతిభవన్‌ మారింది. మియాపూర్‌, హఫీజ్‌పేట భూములకు సంబంధించిన వివాదం సమయంలో కూడా ఇలాగే చేశారు. శాఖ, పాలనాపరమైన సమీక్షలను పక్కన పెట్టేశారు. సామాన్యులు ప్రగతిభవన్‌కు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రిని కలవాలన్నా అవకాశం లేకుండా పోయింది. సామాన్యులను కలవని కేసీఆర్‌.. అవినీతి, తప్పులు చేసిన వారిని ఎలా కలుస్తున్నారు? అన్ని రకాల అనైతిక కార్యక్రమాలు, కుట్రలు, కుతంత్రాలకు ప్రగతిభవన్‌ అడ్డాగా మారింది’’ అని ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని