Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్‌ రాజీనామా

Pashupati Paras: కేంద్రమంత్రి పశుపతి కుమార్‌ పరాస్‌ తన పదవికి రాజీనామా చేశారు. బిహార్‌లో చిరాగ్‌ పాసవాన్‌కు చెందిన ఎల్జేపీ (రాంవిలాస్‌)తో భాజపా పొత్తు పెట్టుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated : 19 Mar 2024 15:26 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌ (Bihar)లో ఎన్డీయే (NDA) భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఇందులో చిరాగ్‌ పాసవాన్‌ (Chirag Paswan) నేతృత్వంలోని ఎల్జేపీ (రాంవిలాస్‌) పార్టీకి ఐదు సీట్లు కేటాయించారు. ఈ పరిణామాలతో అసంతృప్తికి గురైన చిరాగ్‌ బాబాయి, రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్‌ పరాస్‌ (Pashupati Paras) కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. 

‘‘ప్రధాని మోదీ గొప్ప నేత. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. కానీ, బిహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో మాకు అన్యాయం జరిగింది. మా పార్టీకి ఐదుగురు ఎంపీలున్నారు. అయినా పొత్తులో మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా’’ అని పశుపతి పరాస్‌ మంగళవారం మీడియా వెల్లడించారు.

బిహార్‌లో ‘ఎన్డీయే’ సీట్ల పంపకం పూర్తి

ఎన్డీయే మిత్రపక్షమైన లోక్‌ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దళిత నేతగా పేరొందిన రాం విలాస్‌ పాసవాన్‌ మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్‌, సోదరుడు పరాస్‌ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2021లో పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. చిరాగ్‌ ఎన్డీయే నుంచి బయటకు రాగా..  కూటమిలో ఉన్న పశుపతి పరాస్‌కు కేంద్రమంత్రి పదవి దక్కింది. అయితే, ఇటీవల ఎన్డీయే విస్తరణలో భాగంగా చిరాగ్‌ మళ్లీ కూటమిలో చేరగా.. తాజా సర్దుబాటులో వారికి సీట్లు కేటాయించారు.

అయితే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హాజీపుర్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పరాస్‌కు ఇప్పుడు కూటమిలో సీట్లు దక్కలేదు. ఇది ఆయన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. విపక్ష ఇండియా కూటమిలో చేరనున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో పరాస్‌ హాజీపుర్‌ నుంచి గెలుపొందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని