Pawan kalyan: బైజూస్‌ కాంట్రాక్టుపై పవన్‌ ప్రశ్నల వర్షం.. రూ.750 కోట్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

నష్టాల్లో ఉన్న బైజూస్‌ కంపెనీకి రూ.కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని ట్విటర్‌ వేదికగా నిన్న ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు మరికొన్ని ప్రశ్నలు సంధించారు. 

Updated : 23 Jul 2023 16:28 IST

అమరావతి: నష్టాల్లో ఉన్న బైజూస్‌ కంపెనీకి రూ.కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని ట్విటర్‌ వేదికగా నిన్న ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు మరికొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘ రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌ లోడ్‌ చేసిన ట్యాబ్‌ల కోసం దాదాపు రూ.580 కోట్లు ఖర్చు చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో ట్యాబ్‌ విలువ రూ.18వేల నుంచి రూ.20వేల వరకు ఉంటుంది. బైజూస్‌ సీఈవో రవీంద్రన్‌ కంపెనీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌)లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటెంట్‌ లోడ్‌ చేసి ఇస్తామని అంగీకరించారు. వచ్చే ఏడాది మళ్లీ ప్రభుత్వం రూ.580 కోట్లు ఖర్చు చేసి ట్యాబ్‌లు కొననుందా? అని జనసేనాని ట్వీట్‌ చేశారు.

ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన ప్రశ్నలివే.. 

బైజూస్‌ కంటెంట్‌ కోసం వచ్చే ఏడాది నుంచి ఖర్చు  ఎవరు భరిస్తారు? కంపెనీ వారు ప్రతి ఏడాది ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించింది. 8వ తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం బైజూస్‌ వారు కంటెంట్‌ లోడ్‌ చేసిన ట్యాబ్‌లు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పింది. కానీ, బైజూస్‌ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుంచి ఏటా ఉచితంగా కంటెంట్‌ ఇస్తామని చెప్పలేదు.

ఒక వేళ కంపెనీవారు ఖర్చు భరించలేకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? ఏపీ ప్రభుత్వమా లేక విద్యార్థులా? ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో రూ.750 కోట్లు బైజూస్‌ కంటెంట్‌ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఎనిమిదో తరగతి నుంచి 9వ తరగతికి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? 9వ తరగతి కంటెంట్‌ ఖర్చు ఎవరు భరిస్తారు?

బైజూస్‌ సంస్థ ఏ మాధ్యమంలో, ఏ సిలబస్‌ అందజేస్తారు? వారు ఏ విధానం ఆధారంగా సిలబస్‌ రూపొందిస్తున్నారు?అని పవన్‌ కల్యాణ్ ట్విటర్‌ వేదికగా ప్రశ్నలు సంధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని