కేబినెట్‌ విస్తరణ వార్తల వేళ.. జులై 3న మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి భేటీ

ప్రధాని మోదీ (PM Modi) వచ్చే సోమవారం కేంద్ర మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి మండలిలో భారీ మార్పులు జరగనున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated : 29 Jun 2023 17:45 IST

దిల్లీ: త్వరలో కేంద్ర మంత్రివర్గం (Union Council of Ministers)లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల (Lok Sabha elections 2023) నేపథ్యంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జులై 3న  ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి భేటీ జరగనుండటం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది.

వచ్చే సోమవారం (జులై 3న) ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రి మండలితో సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. బుధవారం అర్ధరాత్రి ప్రధాని మోదీ తన నివాసంలో భాజపా (BJP) సీనియర్‌ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలకు అమలు చేయాల్సిన వ్యూహాలతో పాటు మంత్రిమండలిలో మార్పులు గురించి కూడా ఇందులో చర్చించినట్లు సమాచారం. దీంతో త్వరలోనే కేబినెట్‌లో భారీ మార్పులు జరగనున్నట్లు వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రులతో ప్రధాని సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతమున్న మంత్రుల్లో కొందరికి ఉద్వాసన పలికి.. కొత్తవారికి చోటు కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అయితే, సాధారణంగా పార్లమెంట్‌ సమావేశాలకు (Parliament Session) ముందు కూడా మంత్రి మండలి సమావేశమవుతుంది. జులై మూడో వారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు (Mansoon Session) ప్రారంభం కానున్నాయి. మరి మోదీ భేటీ.. పార్లమెంట్‌ సమావేశాలకా? మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!

ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా ఇటీవల పార్టీ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌.. రాష్ట్రాల వారీగా నేతలతో సమావేశాలు జరిపారు. లోక్‌సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) దృష్ట్యా రాష్ట్ర స్థాయిలో సంస్థాగత మార్పులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులు కూడా ఉండొచ్చని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు