Ponnam Prabhakar: ఉపయోగపడేవి ఏవీ చెప్పరు.. ఎప్పుడూ విమర్శలేనా?: మంత్రి పొన్నం

ఇచ్చిన హామీ ప్రకారం కులగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధి చాటుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.

Updated : 17 Feb 2024 11:39 IST

హైదరాబాద్‌: ఇచ్చిన హామీ ప్రకారం కులగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధి చాటుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. ఇందుకోసం సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి మాట్లాడారు.

‘‘గత ప్రభుత్వంలోని నేతలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే మాపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. శుక్రవారం శాసనసభలో కులగణనపై చర్చ సందర్భంగా గతంలో బీసీ మంత్రిగా చేసిన గంగుల కమలాకర్‌ అనేక సార్లు సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలపై నోటికొచ్చినట్లు మాట్లాడటం విచారకరం. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో సకల జనుల సర్వే చేపట్టింది. దానికి సంబంధించిన నివేదికను ఎందుకు బయటపెట్టలేదు? ఇవాళ ఇంత పెద్దగా మాట్లాడుతున్న ఆయన.. ఆ నివేదికను బయటపెట్టాలని ఏనాడైనా ఆ పార్టీ సమావేశాల్లో అడగాలని అనిపించలేదా? అలాంటి స్థితిలో ఉన్నవారు కూడా మాపై విమర్శలు చేస్తున్నారు.

ప్రజలు, నాయకులు.. ఇలా అందరి సలహాలు, సూచనలను తీసుకొనేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు ఏమైనా చెప్పండి అంటే చెప్పరు.. ఎంతసేపూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా కులగణన తీర్మానం చేశాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతిఒక్కరి సహాయసహకారాలు ప్రభుత్వానికి అవసరం. అందరి సలహాలు, సూచనలతోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది’’ అని మంత్రి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని