Raghunandanrao: వారికి రూ.5 లక్షలు కాదు.. రూ.7.50 లక్షలు ఇవ్వండి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ (ఎస్‌డీఎఫ్‌)ని గజ్వేల్‌కు రూ.890కోట్లు, సిద్దిపేటకు రూ.790 కోట్లు కేటాయించారు.అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి దుబ్బాకకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

Updated : 04 Feb 2023 14:13 IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సినవి, చేయాల్సిన అన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గవర్నర్‌ తమిళిసై చేసిన బడ్జెట్‌ ప్రసంగంలోనూ కేంద్రాన్ని విమర్శించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు లేకపోవడం కూడా ఇందుకు నిదర్శనమన్నారు. మెడికల్‌ కళాశాలలు, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ.. ఇతరత్రా చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తోందని రఘునందన్‌రావు వెల్లడించారు.

వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే..

‘‘తెలంగాణ నుంచి వెళ్లేవన్నీ తిరిగి రాష్ట్రానికి రావట్లేదని కొంత మంది ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. దేశం అనే ఒక సమగ్ర స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రాలను ఎలా చూసుకోవాలో కేంద్రానికి తెలుసు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలుసునని భావిస్తున్నాను. తెలంగాణకు ఒక్క మెడికల్‌ కళాశాల రాలేదని పదేపదే విమర్శిస్తున్నారు. దేశంలో ఉన్న ప్రతి జిల్లాలో ఒక మెడికల్‌ కళాశాల తీసుకురావాలని.. ఫలితంగా అన్ని ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రావాలని కేంద్రం ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడే తెలంగాణలో మెడికల్‌ కళాశాలలు ఉన్నందున ప్రాధాన్యత క్రమంలో ఇతర ప్రాంతాలకు కేటాయింపులు చేసింది. అన్ని ప్రాంతాల్లో వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ఇలా చేశారనే విషయాన్ని సభ్యులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.

వాటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ (ఎస్‌డీఎఫ్‌)ను జిల్లాలు, నియోజకవర్గాల వారీగా చేసిన కేటాయింపుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద నేను సేకరించాను. వాటిలో గజ్వేల్‌కు రూ.890కోట్లు, సిద్దిపేటకు రూ.790 కోట్లు కేటాయించారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి దుబ్బాక నియోజకవర్గానికి మాత్రం ఒక్క రూపాయి కేటాయించలేదు. గవర్నర్‌ ప్రసంగంలో రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదు. 9 ఏళ్లు గడుస్తున్నా రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయడం లేదు. గుడిసెలు లేని తెలంగాణను తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్‌ ఒక అడుగు ముందుకేసి.. భాగ్యనగరంలో ఏడాదిలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అందజేస్తామన్నారు. ఇప్పటికే అది జరగలేదు. 100 గజాల స్థలం ఉన్న పేదవారికి వారి స్థలంలోనే రూ.5 లక్షలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి చేయూతనిస్తామని చెప్పారు. గడిచిన కొన్నేళ్లలో అన్నింటి ధరలు పెరిగినందున రూ.5 లక్షలను.. రూ.7.50 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. రాష్ట్రంలో ఉన్న అందిరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు గానీ, ప్రతి ఒక్కరికి జనవరి 2019 నుంచి నిరుద్యోగ భృతి ఇస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టంగా చెప్పారు. అలాగే దళితబంధును అన్ని నియోజవర్గాలకు విస్తారిస్తామన్నారు.. అదీ చేయలేదు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి. నిధుల కేటాయింపు, ఇతరత్రా విషయాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈ ప్రభుత్వం సమదృష్టిలతో చూడాలి’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రఘునందన్‌ కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు