Rahul Gandhi: మోదీజీ.. ఆ రెండింటిపై ఇప్పుడు మాట్లాడరేం: రాహుల్‌

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు......

Published : 15 Feb 2022 01:42 IST

హోషియార్‌పుర్‌: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజల ఖాతాల్లో రూ.15లక్షలు జమచేస్తామని, యువతకు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మాటలు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు. అప్పట్లో ప్రతి ప్రసంగంలోనూ ఇవే విషయాలను చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో కేవలం ఇద్దరు ముగ్గురు బిలియనీర్లకే మేలు జరిగిందని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందనీ.. ప్రతి రాష్ట్రానికీ ఈ సమస్య వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చినప్పట్నుంచి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానాలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దెబ్బతినడం, చిన్న వర్తకులు సంక్షోభంలో పడిపోవడం, రైతాంగానికి నష్టం జరగడంతో నిరుద్యోగం పెరుగుతోందన్నారు. 

పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ పేద కుటుంబం నుంచి వచ్చారన్న రాహుల్.. ఆయనకు పేదల కష్టాలు తెలుసన్నారు. ఆయన నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం ఇద్దరు ముగ్గురు బిలియనీర్ల కోసం కాకుండా పేదలు, రైతులు, కార్మికులు, చిన్నవ్యాపారుల కోసం పనిచేస్తుందని చెప్పారు. తాము ఒకరిద్దరు బిలియనీర్ల కోసం పనిచేసి ఉంటే సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులకు మద్దతుగా నిలిచేవాళ్లం కాదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రక పోరాటం నిర్వహించారని రైతుల్ని కొనియాడిన రాహుల్‌.. ఆ ఉద్యమం చేయకపోయి ఉంటే పంజాబ్‌ రైతులకు మాత్రమే కాకుండా యావత్‌ దేశ రైతాంగానికి నష్టం జరిగిఉండేదన్నారు. తమది రైతు అనుకూల ప్రభుత్వమని, వారి పక్షానే నిలబడి పనిచేస్తామన్నారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం డ్రగ్స్‌ సమస్యపై పనిచేసిందనీ.. మున్ముందు రాష్ట్రం నుంచి పూర్తిగా మాదకద్రవ్యాల్ని నిర్మూలించేందుకు కృషిచేస్తాని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. ఇక్కడ ఫుడ్‌ పార్కు ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని రాహుల్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని