Maharashtra political crisis: ఎమ్మెల్యేలు ముంబయి నుంచి ఎలా జారుకున్నారంటే..?

ఈ మంగళవారం పొద్దుపొద్దున్నే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఉన్నట్టుండి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల జాడ లేకుండా పోయింది.

Updated : 25 Jun 2022 18:57 IST

ముంబయి: ఈ మంగళవారం పొద్దుపొద్దున్నే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఉన్నట్టుండి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల జాడ లేకుండా పోయింది. నిత్యం భద్రతాకవచంలో ఉండే వారంతా చీమ చిటుక్కుమనకుండా రాష్ట్రం ఎలా దాటారా అనే ప్రశ్న అందరిని తొలిచింది. అది ఎలా సాధ్యమైందో కొందరు పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు. 

మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు మొదట ముంబయి నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్‌లోని సూరత్ వెళ్లారు. వాళ్లు రాష్ట్రం దాటిన తర్వాతే ఆ విషయం అందరికి తెలిసింది. భద్రతా సిబ్బంది, పోలీసు అధికారులకు వారు వ్యక్తిగత కారణాలు చెప్పి, మస్కా కొట్టారు. దాంతో వారు రాష్ట్రం దాటుతున్న విషయాన్ని నిఘా వర్గాలు పసిగట్టలేకపోయాయి.

పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..‘ఇలా రాష్ట్రం దాటిన పలువురు ఎమ్మెల్యేలు మొదట తమకు సొంత పని ఉందని తమ భద్రతా సిబ్బందికి చెప్పి, తామున్న ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. వచ్చే వరకు వేచి ఉండమన్నారు. కానీ తర్వాత వారి కన్నుగప్పి సూరత్‌కు బయలుదేరి వెళ్లిపోయారు. ఒక ఎమ్మెల్యే తన కార్యాలయంలో కూర్చొని కొబ్బరి నీళ్లు తాగుతూ, వెంటనే వస్తానని తన మద్దతుదార్లకు చెప్పి వెళ్లిపోయారు. తనకు ముఖ్యమైన పని ఉందని ఇంటికి వెళ్లాలని మరొకరు చెప్పారు. అందుకోసం పార్టీ నేత కారులో కొద్దిదూరం ప్రయాణించారు. మధ్యలో ఆయన్ను బలవంతంగా దించేసి, ముందుకు వెళ్లిపోయారు. తనకు హోటల్‌లో ముఖ్యమైన పని ఉందని, సిబ్బందిని బయటవేచి ఉండమని ఇంకొకరు చెప్పారు. తర్వాత ఇంకో గేట్ నుంచి బయటకు జారుకున్నారు’ అని ఆ అధికారులు వెల్లడించారు. ఇలా ఒక్కొక్కరు తమ వ్యక్తిగత కారణాలు చెప్పడంతో సిబ్బందికి అనుమానం రాలేదు. అయితే వారు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి, సదరు సిబ్బంది తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈలోపే కొన్ని గంటల వ్యవధిలో వారు రాష్ట్రం దాటేశారు. 

ఇలా చడీచప్పుడు లేకుండా వారు వెళ్లిపోవడంపై ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్.. హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్‌(ఎన్‌సీపీ)పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. సమాచార లోపం ఎలా జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే పోలీసుల మాత్రం ఇందులో ఎలాంటి నిఘా వైఫల్యం లేదని వెల్లడించారు. గత కొద్ది నెలలుగా శివసేన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారని నిఘా విభాగం వివరాలు ఇచ్చిందని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని