Sanatan Dharma Row: మతం, రాజకీయాలు వేర్వేరు.. కలిపి చూడాల్సిన అవసరం లేదు: ఖర్గే

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. 

Updated : 08 Sep 2023 21:53 IST

రాయ్‌పూర్‌: సనాతన ధర్మం అంశంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin) ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై  తాజాగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పందించారు. మతం, రాజకీయాలు వేర్వేరు అంశాలని.. ఆ రెండింటినీ కలిపి చూడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘మతం గురించి ఎవరో చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు నేనిక్కడికి రాలేదు. పేదల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చా. మతం, రాజకీయాలు వేర్వేరు అంశాలు. ఆ రెండింటినీ కలిపి చూడాల్సిన అవసరం లేదు. దీనిపై నేను చర్చ చేయదలచుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగామ్‌ జిల్లా తేక్వాలో రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు చేసిన భరోసె కా సమ్మేళన్‌ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఖర్గే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

భాజపాతో జేడీ‘ఎస్‌’.. లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ!

అయితే, ఇటీవల తమిళనాడు ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘సనాతన నిర్మూలన’ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన సదస్సులో ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) మాట్లాడుతూ.. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమన్నారు.  సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడం మాత్రమే కాదు.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అది తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందన్నారు. దీంతో ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలపై భాజపా శ్రేణులు, పలు సంఘాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఖర్గే తమ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నారో, లేదో స్పష్టం చేయాలంటూ ఛత్తీస్‌గఢ్‌ భాజపా నేత, మాజీ మంత్రి రాజేశ్‌ మునాత్‌ డిమాండ్‌ చేశారు. దీంతో ఈ అంశంపై విలేకర్లు ఖర్గేను ప్రశ్నించగా.. పైవిధంగా ఆయన సమాధానం చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని