Revanth Reddy: జోడో యాత్రకు భయపడే.. ఈ కుట్రలు కుతంత్రాలు: రేవంత్‌

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భయపడి భాజపా కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈడీ పేరుతో పార్టీ నాయకులను వేధిస్తోందని విమర్శించారు. గాంధీ భవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ముఖ్య నాయకులను ఈడీ కేసులతో భయపెట్టి కాషాయ పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోందన్నారు.

Published : 04 Oct 2022 01:10 IST

హైదరాబాద్‌: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భయపడి భాజపా కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈడీ పేరుతో పార్టీ నాయకులను వేధిస్తోందని విమర్శించారు. గాంధీ భవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ముఖ్య నాయకులను ఈడీ కేసులతో భయపెట్టి కాషాయ పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోందన్నారు. ‘‘రాహుల్ పాదయాత్రతో మార్పు వస్తుందనే ఉద్దేశంతోనే గతంలో మూసేసిన హెరాల్డ్‌ కేసును మళ్లీ తెరిచారు. ఈడీ అధికారులను ఉసిగొల్పి రాహుల్ గాంధీని విచారణకు పిలిచారు. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నా.. ఆమెను విచారణకు పిలిచి వేధించారు. అయినప్పటికీ భారత్ జోడో యాత్ర ఆగకపోవడంతో రాష్ట్రాల నేతలకు నోటీసులు ఇస్తున్నారు. కర్ణాటకలో యాత్రను అడ్డుకోవడానికి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌ను ఈడీ విచారణకు పిలిచింది. ఏయే రాష్ట్రాల్లో పాదయాత్ర ఉందో.. అక్కడి నేతలకు ఈడీ నోటీసులిస్తోంది’’ అని రేవంత్‌ అన్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని భాజపా ‘ఎలక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌’గా మార్చుకుందని రేవంత్‌ విమర్శించారు. ‘‘గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ లాంటి క్రియాశీల నాయకులకు ఈడీ నోటీసులిచ్చింది. రూ.కోటి చందా ఇచ్చినందుకు ఐదుగురు నేతలకు నోటీసులిచ్చారు. వారిని భయపెట్టి పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలని చూస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. భాజపాకు చందాలిచ్చిన ఏ ఒక్కరికైనా నోటీసులిచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. గత ఆరేడేళ్లలో భాజపాకు రూ.4,841 కోట్ల చందాలు వచ్చాయి అని రేవంత్ అన్నారు.

కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని చెబుతున్న భాజపా.. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై వివరాలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ‘‘బంగారు కూలీ పేరుతో కోట్ల రూపాయలు తెరాస వసూలు చేసిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశాను. అయినా చర్యలు లేవు. తొడుక్కోవడానికి అంగీలు లేని కార్యకర్తలున్న తెరాసకు.. రూ.800 కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయి?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు. దిల్లీలో అత్యంత విలువైన ప్రాంతంలో తెరాస పార్టీ ఆఫీసుకు స్థలం కేటాయించారని, కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి ముందస్తు ఒప్పందంలో భాగంగానే తెరాసకు స్థలం ఇచ్చారని రేవంత్‌ ఆరోపించారు.

ఈడీ నోటీసులు.. వెనకున్న కుట్రలేంటి?

కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయడం వెనకున్న కుట్రను ప్రజలు గమనించాలని రేవంత్‌ కోరారు. కాంగ్రెస్‌లో చేరాలనుకున్న వారిని భయపెట్టి భాజపాలో చేర్చుకుంటున్నారన్నారు. కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ ఎందుకు విచారణ జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మనోధైర్యాన్ని ఈడీ, ఇన్‌కం ట్యాక్స్‌, సీబీఐ దెబ్బతీయలేవన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు అవకాశమిస్తే గుణాత్మక మార్పును తీసుకొస్తామని రేవంత్‌ అన్నారు. 11 రాష్టాల్లో ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా భాజపా ప్రభుత్వాలను ఏర్పాటు చేసున్నారని రేవంత్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని