Andhra News: వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే తప్పేంటి?: సజ్జల

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హత లేని కొంతమంది తెదేపా కార్యకర్తలు గడప గడపకు వైకాపా కార్యక్రమంలో ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ప్రభుత్వ

Published : 13 May 2022 02:09 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హత లేని కొంతమంది తెదేపా కార్యకర్తలు గడప గడపకు వైకాపా కార్యక్రమంలో ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి జరుగుతుంటే కడుపు మంట తట్టుకోలేక తెదేపా అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. వైకాపా కార్యకర్తలెవరూ అసంతృప్తిగా లేరని.. తెదేపా శ్రేణులే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మూడేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చూడాలంటే ఓడిపోయిన తెదేపా నేతలు, అభ్యర్థులను గడప గడపకు కార్యక్రమానికి పంపాలన్నారు. ధైర్యం ఉంటే జరుగుతున్న వాటన్నింటినీ వీడియో తీసిపెట్టాలని సవాల్ విసిరారు.

రాష్ట్రంలో అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేని కౌలు రైతులంటూ ఎవరూ లేరని సజ్జల స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు వెనుక డొంక తిరుగుడు వ్యవహారం ఏదీ లేదని.. రైతులకు శాశ్వతంగా లబ్ధి, విద్యుత్‌ శాఖ, సిబ్బందికి జవాబుదారీతనం ఉండేందుకే మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే తప్పేంటని.. మీటర్ల ఏర్పాటు వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందన్నారు. మీటర్ల ఏర్పాటుపై రైతులను తెదేపా అధినేత చంద్రబాబు రెచ్చగొడుతున్నారని సజ్జల విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని