INDIA: ‘ఇండియా’ కూటమి లోగో సిద్ధం.. ముంబయిలో ఆవిష్కరణ!

ముంబయిలో (Mumbai) నిర్వహించనున్న ఇండియా కూటమి (INDIA) మూడో విడత సమావేశాలకు కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియా గాంధీ హాజరవుతారని ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. 

Published : 28 Aug 2023 18:04 IST

ముంబయి: ఎన్డీయే కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షపార్టీలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ (INDIA) కూటమి మూడో సమావేశం ముంబయిలో (Mumbai) జరగనుంది. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) హాజరవుతారని ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తాజాగా వెల్లడించారు. మరోవైపు ‘ఇండియా’ కూటమికి గుర్తుగా రూపొందించిన లోగోను కూడా ఈ సమావేశాల్లోనే సోనియా ఆవిష్కరిస్తారని ఆయన అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన అజెండాపై చర్చిస్తారని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌, జేడీయూ, తృణమూల్‌, ఆమ్‌ఆద్మీ, ఎన్సీపీ సహా దాదాపు 24 పార్టీలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయా పార్టీల ముఖ్యనేతలంతా బిహార్‌ రాజధాని పట్నాలో గత జూన్‌లో తొలిసారిగా సమావేశమయ్యారు. బెంగళూరులో జరిగిన రెండో విడత సమావేశంలో కూటమి పేరును ఖరారు చేశారు. తాజాగా కూటమి లోగోను ఆవిష్కరించనున్నారు. అయితే, ఇండియూ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరా? అనేదానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ సమావేశాల్లోనే ప్రధాని అభ్యర్థిని కూడా ఖరారు చేసే అవకాశముందని కొందరు భావిస్తున్నారు. జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ పేరు వినిపిస్తున్నప్పటికీ, కాంగ్రెస్‌ లాంటి పెద్ద పార్టీని కాదని, నీతీశ్‌ను ప్రధాని అభ్యర్థిగా మిగతాపార్టీలు అంగీకరిస్తాయా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని