Sanju Samson: వరల్డ్‌ కప్‌ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్

భారత జట్టు తరఫున వరల్డ్‌ కప్‌ ఆడే అవకాశం సంజూ శాంసన్‌కు దక్కింది. పొట్టి కప్‌ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది.

Published : 01 May 2024 15:11 IST

ఇంటర్నెట్ డెస్క్: ఎట్టకేలకు భారత ఆటగాడు సంజూ శాంసన్‌ (Sanju Samson) ప్రపంచ కప్‌ జట్టులోకి అడుగుపెట్టాడు. గత వన్డే వరల్డ్‌కప్‌ సమయంలోనూ అతడి పేరు బాగా వినిపించినా.. కొన్ని సమీకరణాల వల్ల సంజూకు చోటు దక్కలేదు. ఈసారి మాత్రం అద్భుతమైన ఫామ్‌తో ఐపీఎల్‌లో పరుగులు చేస్తుండటంతో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. రిషభ్‌ పంత్‌కు బ్యాకప్‌గా సంజూను తీసుకున్నా.. మిడిలార్డర్‌లో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానైనా బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు. దీంతో తమ అభిమాన ఆటగాడికి అవకాశం దక్కడంపై సోషల్ మీడియా ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సంజూ తన మాతృభాష మలయాళంలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. 

‘‘వియర్పు తునియిట్టా కుప్పాయమ్’’.. ఇదీ సంజూ చేసిన పోస్టు. దీనికి అర్థం ‘‘చెమట, కష్టంతో కుట్టిన చొక్కా’’. భారత జాతీయజట్టులో అరంగేట్రం చేసిన చాన్నాళ్లకు ఇప్పుడు అవకాశం రావడంతో అతడు ఇలా స్పందించాడని క్రికెట్ పండితులు చెబుతున్నారు. 2015లో భారత జట్టు తరఫున టీ 20ల్లోకి అడుగుపెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్ సంజూ నిలకడగా జాతీయజట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో భారీగా పరుగులు చేస్తున్నా.. సెలెక్టర్లు మాత్రం అతడిని పక్కన పెట్టేశారు. ఇప్పటివరకు కేవలం 25 అంతర్జాతీయ టీ20లను ఆడిన సంజూ 374 పరుగులు చేశాడు. ఓపెనర్‌, మిడిలార్డర్‌లో పరుగులు చేయడం అతడి స్పెషాలిటీ. ఐపీఎల్‌లో 161 మ్యాచుల్లో ఆడిన అతడు 4,273 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు సెంచరీలు, 24 హాఫ్‌ సెంచరీలూ ఉన్నాయి. ఇప్పుడు భారత జట్టు తరపున వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగుతున్న సంజూకి తుది జట్టులోనూ స్థానంలో కల్పించాలని అభిమానులు కోరుతున్నారు. 


దూబె ఎంపిక భారత్‌పై ‘ఇంపాక్ట్‌’ ఉంటుంది: స్టీఫెన్ ఫ్లెమింగ్‌

చెన్నై సూపర్ కింగ్స్‌ ఆల్‌రౌండర్ శివమ్‌ దూబెను వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేయడంపై ఆ ఫ్రాంచైజీ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ‘‘స్పిన్నర్లపై ఎదురుదాడి చేయడంలో దూబెని మించిన వారెవరూ లేరని నిరూపించుకున్నాడు. అతడి పవర్‌ అద్భుతం. తప్పకుండా వరల్డ్‌ కప్‌లో భారత్‌ ‘ఎక్స్‌’ ఫ్యాక్టర్ అవుతాడు. ఇంత మంచి అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. మ్యాచ్‌ను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఆడటంలో నేర్పరి. చెన్నై జట్టుకు దూబె బలంగా మారాడు. తాను సరిగ్గా ఆడలేని బంతులను ఎదుర్కొనేందుకు చాలా కష్టపడతాడు. ఇప్పుడు ఫామ్‌తో భారత్‌పై ‘ఇంపాక్ట్‌’ చూపిస్తాడు’’ అని ఫ్లెమింగ్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని