Kumaraswamy : జేడీఎస్‌ కథ ముగిసిపోయిందన్న భ్రమలో కాంగ్రెస్‌ ఉంది : కుమారస్వామి

కర్ణాటకలో రైతుల ఆత్మహత్యల గురించి అధికార కాంగ్రెస్‌ పట్టించుకోవడం లేదని జేడీఎస్‌ నేత కుమారస్వామి విమర్శించారు. అలాగే భాజపాతో పొత్తు గురించి కూడా ఆయన స్పందించారు.

Published : 17 Jul 2023 15:23 IST

బెంగళూరు : కర్ణాటకలో (Karnataka) అధికారంలోకి రావడంతో జేడీఎస్‌ కథ ముగిసిపోయిందన్న భ్రమలోకి కాంగ్రెస్‌ వెళ్లిందని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్‌-భాజపా జట్టు కట్టబోతున్నాయన్న ప్రచారంపై కూడా ఆయన మాట్లాడారు. కర్ణాటకలో 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసినా అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ విషయం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని విమర్శించారు. రైతులు ఎలాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేయకపోవడం శోచనీయమని అన్నారు. ఇవాళ బెంగళూరులో విపక్ష నాయకులతో భేటీ నిర్వహిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ బెంగళూరు నగర రోడ్ల వెంబడి భారీగా బ్యానర్లు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ పేరును ప్రస్తావించకుండానే కుమారస్వామి విమర్శలు చేశారు. ఏమీ చేయకపోయినా.. ఏదో గొప్పగా సాధించామనేలా వారు బ్యానర్లు కట్టారని దుయ్యబట్టారు.

వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా-జేడీఎస్‌ జట్టు కడతాయనే వార్తలపై కూడా కుమారస్వామి స్పందించారు. పొత్తుల విషయం ఇప్పుడు అప్రస్తుతమని ఆయన వ్యాఖ్యానించారు. జేడీఎస్‌ ఎన్డీయేలో చేరుతోందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు పై విధంగా బదులిచ్చారు. ‘ఎన్నికలకు ఇంకా 8 నుంచి 9 నెలల సమయం ఉంది. ఏం జరుగుతుందో చూద్దామని’ చెప్పారు.

‘ఎన్నికల ప్రచారంలో ఈడీ..’: స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు

ఈ ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 135 చోట్ల విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వేర్వేరుగా పోటీ చేసిన భాజపాకు 66, దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్‌కు 19 స్థానాలు మాత్రమే దక్కడంతో ప్రతిపక్షంలో కొనసాగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం కొన్నాళ్లుగా  సాగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని