ED Raids: ‘ఎన్నికల ప్రచారంలో ఈడీ..’: స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు

తమిళనాడు మంత్రుల ఇళ్లల్లో ఈడీ వరుస సోదాలు (ED Raids) చేపట్టడం రాజకీయ దుమారానికి దారితీసింది. తాజాగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి నివాసంలో అధికారులు తనిఖీలు చేశారు. దీంతో సీఎం స్టాలిన్‌ తీవ్రంగా స్పందించారు.

Updated : 17 Jul 2023 13:28 IST

చెన్నై: మనీలాండింగ్‌ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా తమిళనాడు (Tamilnadu) మంత్రి కె. పొన్ముడి (K Ponmudy) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోమవారం సోదాలు (ED Raids) చేపట్టారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ (MK Stalin) తీవ్రంగా స్పందించారు. ఈడీ ‘ఎన్నికల ప్రచారంలో’ చేరిందంటూ దర్యాప్తు సంస్థపై ఘాటు విమర్శలు చేశారు.

2007-2011 మధ్య గత డీఎంకే (DMK) ప్రభుత్వంలో పొన్ముడి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో క్వారీ లైసెన్సు నిబంధనలను ఉల్లంఘించారని, గనుల కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం పొన్ముడి, ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్‌ సిగమణి పొన్‌ నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు జరిపారు.

వ్యూహాలకు పదును.. అధికార, విపక్షాల బల ప్రదర్శనకు రంగం సిద్ధం

కాగా.. మనీలాండరింగ్‌ కేసులో (money laundering case) రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజీని ఈడీ గత నెల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే మరో మంత్రిపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కుట్రపూరితంగానే తమ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని డీఎంకే మండిపడింది.

విపక్షాల సమావేశం (Opposition Meet) కోసం బెంగళూరు బయల్దేరిన సీఎం స్టాలిన్‌ (CM Stalin) తాజా సోదాలపై స్పందించారు. ‘‘ఇటీవలే పొన్ముడిపై ఉన్న రెండు కేసులను కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఈడీ సోదాలు చేపట్టింది. ప్రతిపక్షాల భేటీ నుంచి ప్రజల దృష్టికి మళ్లించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మా కోసం తమిళనాడు గవర్నర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈడీ కూడా ఈ ప్రచారంలో చేరింది. ఇక మా ఎన్నికల పని సులువుగా అవుతుందని భావిస్తున్నా’’ అంటూ సీఎం వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఎన్నికల వేళ ఈడీ చేపట్టే ఈ దాడులు సాధారణమేనని, ఇలాంటి బెదిరింపులకు డీఎంకే భయపడదని అన్నారు.

మోదీ ప్రభుత్వం స్క్రిప్ట్‌: కాంగ్రెస్‌

అటు కాంగ్రెస్‌ (Congress) కూడా ఈ సోదాలను తీవ్రంగా ఖండించింది. ‘‘విపక్షాల భేటీకి ముందు తమిళనాడు మంత్రిపై దాడులు జరగడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. విపక్షాలను విడగొట్టేందుకు మోదీ ప్రభుత్వం రాసిన స్క్రిప్ట్‌ ఇది. మోదీ ప్రభుత్వం పాల్పడుతున్న ఈ రాజకీయ కుట్రలపై పోరాడేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు చేసే ఈ ప్రయత్నాలకు మేం ఎన్నడూ తలొగ్గం’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని