Updated : 11 Jan 2022 17:32 IST

Ap News: ప్రజా చైతన్యం కోసమే ‘‘తెలుగుదేశం చైతన్య రథం’’: చంద్రబాబు

అమరావతి‌: ‘‘కొంతమంది అవినీతి డబ్బుతో పేపర్, టీవీ ఛానెల్ పెట్టినా తేదేపా ఎప్పుడూ సొంత మీడియా సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయలేదని. కార్యకర్తలు ప్రజలను చైతన్య పరిచే ఆయుధంగా చైతన్య రథం పనిచేస్తుంది’’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ‘‘చైతన్య రథం’’ పేరిట రూపొందించిన తెలుగుదేశం పార్టీ ఈ-పేపర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కనకమేడల రవీంద్ర కుమార్, చినరాజప్ప, గన్ని వీరాంజనేయులు, జోగేశ్వరరావు, టీడీ జనార్దన్, చింతకాయల విజయ్, పంచుమర్తి అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్రంగా పనిచేసే మీడియాపై వైకాపా ప్రభుత్వం వేటు వేసిందని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ నియంత్రణలో లేకుంటే తప్పుడు కేసులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. వీళ్ళు పుట్టక ముందు నుంచి ఉన్న మీడియా సంస్థలకు కూడా కులముద్ర వేసి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదనే విధంగా వ్యవహరిస్తున్నారని  చంద్రబాబు మండిపడ్డారు.

‘‘60 శాతం మంది ప్రజలు ఇప్పటికే సామాజిక మధ్యమాలకు అలవాటు పడ్డారు. సొంతూరు విశేషాలు రియల్ టైమ్‌లో తెలుసుకునేందుకు ఇష్టపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న 70లక్షల మంది కార్యకర్తలకు సమాచారం చేరవేసేలా ‘చైతన్య రథం’ ఈ-పేపర్‌ను తీర్చిదిద్దుతాం. ఒక్క క్లిక్‌తో 30లక్షల మంది పార్టీ శ్రేణులకు ఈ-పేపర్‌ను పంపించాం. ఇప్పటికే అనేక సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ సమాచారాన్ని చేరవేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మీడియాకు ఓ విశ్వసనీయత ఉంది. కొంత మంది అవినీతి సొమ్ముతో  పేపర్లు పెట్టారు. విపరీతంగా డబ్బులు దండుకున్నారు. కొంత మంది ఎలక్ట్రానిక్‌ మీడియాను కూడా పెట్టుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. 20 ఏళ్లకుపైగా అధికారంలో ఉన్నా పేపర్‌ పెట్టాలని, టీవీ పెట్టాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. దానికి కారణం.. మీడియా వాళ్లు వారి పని వారు చేస్తారు.. మనం రాజకీయం చేయాలి. మనం చేసే పని ప్రజాహితం కోరి ఉంటే పేపర్లలో ఏది రాయాలో అదే రాస్తారనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు ముందుకు వెళ్లాం. నేటి తరం పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాకు అలవాటు పడ్డారు. ప్రపంచంలో ఏం జరిగిందనే దాని కన్నా.. నా గ్రామంలో ఏం జరిగిందనే విషయాలను తెలుసుకుంటే సంతృప్తిగా ఉంటుంది. అందుకే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చైతన్య రథం ఈ-పేపర్‌ను తీసుకొచ్చాం. దీన్ని లాజికల్‌గా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం’’ అని చంద్రబాబు వివరించారు.

‘‘రెండు రాష్ట్రాల్లో కలిపి తెలుగుదేశం పార్టీకి 60 నుంచి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. అనుబంధ సంస్థలు ఉన్నాయి. వీళ్లందరినీ యాక్టివేట్‌ చేస్తాం. ఏ గ్రామంలో ఏం జరిగింది.. ఈ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయనే విషయాలను దీని ద్వారా వెలుగులోకి తీసుకొస్తాం. బాధితులకు తెదేపా ఏ విధంగా అండగా ఉందనే విషయాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాం. జాతీయ, రాష్ట్ర సమాచారం సహా నియోజకవర్గాల వారీగా సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా స్థానికంగా వచ్చే వార్తలపై ఎక్కువ శ్రద్ధ పెడతాం. తెదేపా సానుభూతిపరులు, కార్యకర్తలు, ప్రజాహితం కోరుకొనేవారు, రాష్ట్ర భవిష్యత్తు కోరుకొనే వారు తెలుగుదేశం పార్టీ ఈపేపర్‌ చదవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే పసుపు మీడియా అని మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా తెదేపా ఎవరికీ భయపడేది లేదు.. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఆపేది లేదు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని