TDP Sand Satyagraha: తెదేపా ‘ఇసుక సత్యాగ్రహం’.. దేవినేని ఉమా సహా పలువురు ముఖ్య నేతల అరెస్ట్

ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. వైకాపా నేతల అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు చేపట్టిన ‘ఇసుక సత్యాగ్రహం’ మూడో రోజుకు చేరింది.

Updated : 30 Aug 2023 15:33 IST

అమరావతి: వైకాపా నేతల అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు చేపట్టిన ‘ఇసుక సత్యాగ్రహం’ మూడో రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తెదేపా ముఖ్యనేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నిరసన తెలుపుతున్న మరికొందరు నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నంలోని  డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయాన్ని(డీఎంజీ) ముట్టడికి తెదేపా పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా వైకాపా ఇసుక దోపిడీ గురించి తెదేపా సేకరించిన ఆధారాలను డీఎంజీ డైరెక్టర్‌కు సమర్పించి, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు యత్నించిన దేవినేని ఉమ, తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను హౌస్‌ అరెస్ట్‌ చేయడంతో గొల్లపూడిలోని ఇంటి వద్దే దేవినేని నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.

ChandraBabu: ఎన్నికల పొత్తులను కాలమే నిర్ణయిస్తుంది

వైకాపా నేతలు తాడేపల్లి ప్యాలెస్‌కు కప్పం కట్టారు: దేవినేని

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. ఆనాడు బ్రిటిష్‌ పాలనలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేస్తే ఈరోజు జగన్‌మోహన్ రెడ్డి రాక్షస పాలనలో తెదేపా ఇసుక సత్యాగ్రహం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలసీ తీసుకొస్తామని జగన్‌ చెబితే ప్రజలంతా నమ్మారన్నారు. వైకాపా నాయకులు గనులశాఖను అడ్డం పెట్టుకుని ఇసుక దోపిడీ చేసి ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కు కప్పం కట్టారని ఉమా ఆరోపించారు. 

ముందస్తు అరెస్టులు.. నోటీసులు

‘ఇసుక సత్యాగ్రహం’ కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజా, తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్‌ ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పలువురి తెదేపా నేతలను గృహనిర్బంధం చేయగా మరికొంత మందికి నోటీసులు ఇచ్చారు.

విజయవాడకు వెళ్లేందుకు ప్రయత్నించిన అద్దంకి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నాగినేని రామకృష్ణను అద్దంకి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, అవనిగడ్డలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, తిరువూరులో నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి దేవదత్‌ను హౌస్‌ అరెస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని