Dhulipalla Narendra: విజనరీ.. ప్రిజనరీకి తేడా తెలుస్తోంది: ధూళిపాళ్ల

ఏపీలో నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాలు చూసి చాలా మంది పిల్లలు బాధ పడుతున్నారని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.

Updated : 07 Jun 2022 14:04 IST

మంగళగిరి: ఏపీలో నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాలు చూసి చాలా మంది పిల్లలు బాధ పడుతున్నారని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. ఫలితాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో 5వేలకు పైగా పాఠశాలలు మూతపడుతున్నాయి. బడుల మూసివేతతో వెనుకబడిన వర్గాలు విద్యకు దూరం అవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 20వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాతృభాషలో బోధనను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆంగ్లభాష బోధన వల్ల చిన్నారుల మానసిక వికాసం దెబ్బతింటోంది. నాడు- నేడు కార్యక్రమం పైన పటారం.. లోన లొటారం. పదో తరగతి ఫలితాల్లో దశాబ్ద కాలంలో ఇంతటి వైఫల్యం లేదు. విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించకుండా తల్లిదండ్రులపై నెట్టడం తప్పు. మంత్రి లేకపోవడంతో ఫలితాలు ఆపడం అన్యాయం.

కొవిడ్‌తో ఇతర రాష్ట్రాలు విద్యాప్రమాణాలు పెంచాలని ప్రయత్నించాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయులను వైన్‌ షాపుల వద్ద ఉంచింది. పదో తరగతి విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా భావించాలి. విద్యార్థులను ఆంగ్ల మాధ్యమంలో చేరాలని బలవంతపెట్టడం దారుణం. ఐటీ రంగంలో తెలుగువారు ముందుండడం చంద్రబాబు ఘనతే. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎత్తేయడం బాధాకరం. విజనరీ సీఎం చంద్రబాబు, ప్రిజనరీ సీఎం జగన్‌కు తేడా తెలుస్తోంది’’ అని ధూళిపాళ్ల అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని