రాహుల్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల భేటీ.. మధ్యలోనే బయటకొచ్చిన కోమటిరెడ్డి

రాహుల్‌ గాంధీతో దిల్లీలో జరిగిన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల భేటీ ముగిసింది. రాహుల్‌ గాంధీతో 39 మంది కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు హాజరైన వారిలో ఉన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన రాహుల్‌.. కాంగ్రెస్‌ నేత...

Updated : 04 Apr 2022 22:55 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో దిల్లీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల భేటీ ముగిసింది. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ మంత్రులతో పాటు మొత్తం 39 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్న రాహుల్‌.. పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకొని వారికి దిశానిర్దేశం చేశారు. విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మనస్పర్ధలు, విభేదాలు ఉంటే పార్టీ వేదికపైనే చెప్పాలని.. ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిన మాట్లాడొద్దని హితవుపలికారు. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్టు సమాచారం. ఏదైనా ఉంటే తనతో గానీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో గానీ మాట్లాడాలని నేతలకు సూచించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

భేటీ అనంతరం కాంగ్రెస్‌ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలందరికీ  రాహుల్‌ గాంధీ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌కు శషబిషలు లేవు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా పోరాడతాం. మతం ముసుగులో భాజపా రాజకీయం చేస్తోంది. సమాజంలో చీలిక తెచ్చేందుకు తెరాస, భాజపాలు యత్నిస్తున్నాయి. కాంగ్రెస్‌ నేతలందరూ ఒకే గొంతుకై పోరాడుతాం. తెలంగాణలో ప్రతి తలుపు తడతాం. తెరాస, మజ్లిస్‌తో పొత్తు ఉండదని రాహుల్‌ సమక్షంలో నిర్ణయం తీసుకున్నాం. రాహుల్‌ గాంధీ సమక్షంలోనే అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తాం. ఎన్నికలకు 6 నెలల ముందే టికెట్లు కేటాయిస్తాం. ఐకమత్యంతో ఉంటూ తెరాస, భాజపాలను ఓడిస్తాం. రాష్ట్రానికి రావాలని రాహుల్‌గాంధీని ఆహ్వానించాం. వీలైనన్ని ఎక్కువ సార్లు రాష్ట్రంలో పర్యటిస్తానని రాహుల్‌ చెప్పారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం’’ అని నేతలు పేర్కొన్నారు.

టికెట్ల ప్రకటనపై భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాహుల్‌ గాంధీతో మాట్లాడారు. పలు విషయాలను రాహుల్‌ దృష్టికి తీసుకొచ్చిన కోమటిరెడ్డి.. భేటీ ముగియక ముందే బయటకు వచ్చారు. దీనిపై కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘దిల్లీ వర్సిటీలో తెలుగు విద్యార్థులతో భేటీ కోసం బయటకు వచ్చాను. జిల్లాల్లో పార్టీ బలోపేతం, పీసీసీ చీఫ్‌ వ్యవహారశైలిపై రాహుల్‌తో మాట్లాడాను. ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థులను ఖరారు చేసి కార్యాచరణ చేపట్టాలని కోరాను. కరీంనగర్‌ జిల్లాలో ఒకటి రెండు చోట్ల పీసీసీ చీఫ్‌ ఏకపక్షంగా అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ విషయాన్ని రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్లాను. కరీంనగర్‌ జిల్లా నేతలు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డితో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారు. అభ్యర్థుల ప్రకటనకు అధిష్ఠానం అనుమతి ఇచ్చిందా? ముందే అభ్యర్థుల ప్రకటనతో సీనియర్లపై ఒత్తిది పెరుగుతోంది. కాంగ్రెస్‌ పంథాలోనే ముందుకు పోవాలి కదా’’ అని కోమటిరెడ్డి ఆసహనం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని