Telangana News: డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నాయి: రేవంత్‌ రెడ్డి

ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో తెలంగాణలోని డిస్కంలు అప్పులపాలు అయ్యాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుపై తెలంగాణ...

Published : 26 Feb 2022 01:31 IST

హైదరాబాద్: ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో తెలంగాణలోని డిస్కంలు అప్పులపాలు అయ్యాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఛార్జీల పెంపుపై తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) బహిరంగ విచారణ చేపట్టింది. బహిరంగ సమావేశంలో సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ వాదనలు వినిపించారు.

రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వినియోగదారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, పథకాలపై ఛార్జీలను డిస్కంలకు చెల్లించాలి. ఏటా డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16 వేల కోట్లు చెల్లించాలి. ప్రభుత్వం మాత్రం ఏటా రూ. 10 వేల కోట్లను ఎగవేస్తూ.. కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. దీంతో డిస్కంల అప్పులు రూ. 60 వేల కోట్లకు చేరాయి. డిస్కంల ప్రధాన డిఫాల్టర్‌ రాష్ట్ర ప్రభుత్వమే. బిల్లులు చెల్లించని వినియోగదారులపై చర్యలు తీసుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వంపైనా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి ఛార్జీలను వసూలు చేయకపోవడమే నష్టాలకు కారణం. వినియోగదారులపై భారం మోపే డిస్కంలు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నాయి.

తెలంగాణలో డిస్కంలు పూర్తిగా దివాళా తీశాయి. రాష్ట్రంలో సోలార్ విద్యుత్‌ ఉత్పత్తి కేవలం ఒక్క మెగావాట్ మాత్రమే. సోలార్ విద్యుత్‌ కొనుగోలులో యూనిట్‌కి 70 పైసలు అధికంగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. సరళీకృత విధానాలు తెచ్చిన తర్వాత కూడా భద్రతాపరమైన చర్యలు లేవు. బిల్లులు వసూలు కాకుండా మిగిలిన విద్యుత్‌ను వ్యవసాయం ఖాతాలో వేస్తున్నారు. హైదరాబాద్, సిద్దిపేటలో బకాయిలు అధికంగా ఉన్నాయి. నిర్వహణ లోపం కారణంగా తీగలు వేలాడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. వారిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదు?రాజకీయ బాసుల మెప్పు కోసం సంస్థకు నష్టం చేస్తున్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను మేం తిరస్కరిస్తున్నాం. ఛార్జీల పెంపుపై ట్రాన్స్‌కో ప్రతిపాదనలు ఈఆర్‌సీ తోసిపుచ్చాలి’’ అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరుతో దోపిడీ: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

‘‘విద్యుత్‌ ఛార్జీలను పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం. తక్కువ ధరకే కేంద్రం నుంచి కొనుగోలు చేయాలి. అంతర్గత ఆర్థిక సామర్థ్యాలను పెంచుకోవడం, సరఫరా నష్టాలను తగ్గించుకోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ సకాలంలో చెల్లిస్తే పెంపు అవసరం ఉండదు. క్రమం తప్పకుండా సబ్సిడీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. తక్కువ వినియోగించే వారకి ఎక్కువ.. ఎక్కువ వినియోగించే వారికి తక్కువ పెంపు ఉంటుంది. డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరుతో దోపిడీ జరుగుతోంది. ఒక్కోసారి భారీగా బిల్లులు వస్తున్నాయి. వీటిని నియంత్రించే అధికారం ఈఆర్సీకి ఉందా?లేదా?ఈ అంశాన్ని ఈఆర్‌సీ పరిశీలించాలి. ప్రతి సంవత్సరం అంచనాలు వేసుకుని పెంపు ఉంటె ఇంత పెరిగేది కాదు. ఒక్కసారిగా 50 పైసలు పెంచడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై అధిక భారం పడుతోంది. 11.3 శాతం విద్యుత్‌ సరఫరా నష్టాలు చూపిస్తున్నారు. వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఆ భారాన్ని కూడా వినియోగదారులపై మోపుతున్నారు. విద్యుత్‌ వినియోగం లెక్కల్లో తేడా ఉందని అనుమానాలు ఉన్నాయి. ఈఆర్‌సీ ఈ అంశాన్ని పరిశీలించాలి’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని