‘రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు తెరాసదే’

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం ద్వారా రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని మరోసారి నిరూపితమైందని రాష్ట్ర మంత్రులు

Updated : 21 Mar 2021 10:50 IST

వాణీదేవి విజయం పట్ల రాష్ట్ర మంత్రుల హర్షం

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం ద్వారా రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని మరోసారి నిరూపితమైందని రాష్ట్ర మంత్రులు అన్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి విజయం పట్ల రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెరాసకు ఓటు వేసిన పట్టభద్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలకు పట్టభద్రులు పట్టం కట్టారని పేర్కొన్నారు.

అభివృద్ధిని విస్మరించి, ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్న జాతీయ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మంత్రులు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు తెరాసదేన‌ని మ‌రోసారి రుజువైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకుంటారని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. మతాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలనుకునే వారికి పట్టభద్రులు గుణపాఠం చెప్పారన్నారు. తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు గుర్తించారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని