BJP: కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో దాడులు జరిగితే.. రాహుల్‌, ప్రియాంకా మౌనం?

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరిగితే రాహుల్‌, ప్రియాంకా గాంధీలు ఎందుకు మౌనంగా ఉంటారని భాజపా ఎదురుదాడి మొదలుపెట్టింది.

Published : 13 Oct 2021 02:22 IST

కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడిన భాజపా

దిల్లీ: కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరిగితే రాహుల్‌, ప్రియాంకా గాంధీలు ఎందుకు మౌనంగా ఉంటారని భాజపా ఎదురుదాడి మొదలుపెట్టింది. రాజస్థాన్‌, మహారాష్ట్ర...తదితర రాష్ట్రాల్లో ఎస్సీ వర్గాలపై దాడులు జరుగుతున్నా కాంగ్రెస్‌ నేతలు పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నించింది. దళిత హక్కుల ఛాంపియన్‌లుగా చెప్పుకునే రాహుల్‌, ప్రియాంకా గాంధీలు ఆయా రాష్ట్రాల్లో ఎందుకు పర్యటించడం లేదని విమర్శించింది. లఖింపుర్‌లో రైతులపై హింసాత్మక ఘటనల అనంతరం ప్రియాంకా గాంధీ అక్కడ పర్యటిస్తోన్న నేపథ్యంలో వారిపై భాజపా మండిపడింది.

‘రాహుల్‌ , ప్రియాంకా గాంధీ వాద్రాలు దళిత హక్కుల నేతలుగా భావిస్తుంటారు. కానీ, రాజస్థాన్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ వర్గాలపై జరుగుతోన్న అకృత్యాలపై మాత్రం ఎందుకు మౌనంగా ఉంటారు’ అని భాజపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా విమర్శించారు. లఖింపుర్‌ ఖేరి ఘటన పేరుతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ‘రాజకీయ యాత్ర’ చేస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరిగితే అక్కడ మాత్రం పర్యటించరని భాజపా జనరల్‌ సెక్రటరీ దుష్యంత్‌ గౌతమ్‌ ప్రశ్నించారు.

ఇదిలాఉంటే, లఖింపుర్‌ ఖేరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళి అర్పించేందుకు రైతు సంఘాలు మంగళవారం నాడు సంస్మరణ సభ ఏర్పాటు చేశాయి. ఇందుకు పెద్ద సంఖ్యలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి రైతులు రావడంతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి అక్కడకు వచ్చినట్లు సంయుక్త్‌ కిసాన్‌ మెర్చా వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని