AP 3 Capitals: మూడు రాజధానులపై సీఎం జగన్‌ కీలక ప్రకటన

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది.

Updated : 22 Nov 2021 15:52 IST

అమరావతి: అమరావతి ప్రాంతమంటే తనకు వ్యతిరేకత లేదని, అయితే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి (chief minister jagan mohan reddy) సోమవారం శాసనసభలో ప్రకటన చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని స్పష్టం చేశారు. అమరావతి సీఆర్‌డీఏ(CRDA) చట్టాన్ని పునరుద్ధరిస్తూ సోమవారం ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టింది. ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు  శాసనసభలో ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. గుంటూరులో హైకోర్టు ఉండేది. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు న్యాయం చేయాల్సి ఉంది. 1956లో కర్నూలు నుంచి రాజధానిని, గుంటూరు నుంచి హైకోర్టును హైదరాబాద్‌కు తీసుకుపోయారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతమంటే నాకు వ్యతిరేకత లేదు. నా ఇల్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు ఎకరాకు రూ.2కోట్లు చొప్పున 50వేల ఎకరాలకు లక్ష కోట్లు అవుతుందని గత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఖర్చు తాజా లెక్కల ప్రకారం అవుతుంది. పదేళ్ల తర్వాత ఈ లక్ష కోట్ల విలువ ఆరేడు లక్షల కోట్లు అవుతుంది. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే రాజధాని ఊహా చిత్రం ఎలా సాధ్యమవుతుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసమేనా? మనకు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? పిల్లలందరూ పెద్ద నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విశాఖ. అక్కడ అన్నీ వసతులు ఉన్నాయి. వాటికి అదనపు హంగులు అద్దితే, ఐదారేళ్ల తర్వాత అయినా హైదరాబాద్‌ వంటి నగరాలతో పోటీ పడే అవకాశం ఉంది.రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలనే తాపత్రయంతోనే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసనసభ, ఒకప్పటి రాజధాని అయిన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి, తద్వారా ప్రజలకు మంచి చేయాలని ఈ ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ క్రమంలో ఏమేం జరిగాయో అన్నీ చూశాం. రకరకాలు అపోహలు సృష్టించారు. న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యేలా చేశారు. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన చేయాల్సి వస్తోంది’’

‘‘రాజధానుల బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజు దాని నుంచి మంచి ఫలితాలు ఈపాటికే అందుబాటులోకి వచ్చి ఉండేవి. నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక స్ఫూర్తితో వెనుకబడిన ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం. అందుకే వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టాం. గతంలో కేంద్రీకరణ ధోరణులను ప్రజలు ఎంత వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. మరోసారి హైదరాబాద్‌లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని, ప్రజల తీర్పు స్పష్టం చేసింది. అందుకే వికేంద్రీకరణ సరైన విధానమని నమ్మి అడుగులు వేశాం. అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు వీరందరి ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నది కాబట్టే ఈ రెండేళ్ల కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని మనసారా దీవించారు. అయితే, వికేంద్రీకరణ సంబంధించి అనేక అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు చేశారు. వికేంద్రీకరణ మంచిదని నమ్మి అడుగులు వేశాం. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్ట, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందు పరిచేందుకు, బిల్లులను మరింత మెరుగు పరిచేందుకు విస్తృతంగా వివరించేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తాం’’ అని సీఎం జగన్‌ శాసనసభలో ప్రకటన చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని