Shashi Tharoor:ఏ విపక్ష ఫ్రంట్‌కైనా.. కాంగ్రెస్‌ అవసరం అనివార్యం!

విపక్షాలతో కూడిన ఏదైనా ఫ్రంట్‌ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్‌ పార్టీ అవసరం అనివార్యమని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ పేర్కొన్నారు.

Published : 21 Dec 2021 01:40 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌

కోల్‌కతా: విపక్షాలతో కూడిన ఏదైనా ఫ్రంట్‌ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్‌ పార్టీ అవసరం అనివార్యమని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా కాషాయ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తే కలిగే ప్రయోజనాలపై మమతా బెనర్జీ ఆలోచించాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉందని.. అదే సమయంలో భాజపాను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని సూచించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న సమయంలో కోల్‌కతా పర్యటన సందర్భంగా పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశిథరూర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రంలో భాజపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తమదే అసలైన కాంగ్రెస్‌ అంటూ ఉద్ఘాటిస్తున్నారు. వీటిపై శశిథరూర్‌ స్పందించారు. ‘మమతా బెనర్జీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఆమె విలక్షణమైన నాయకురాలు. ఇటీవలే భాజపాపై ఘనవిజయం సాధించారు. ఇదే సమయంలో తమతోపాటు ఇతర విపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తే కలిగే ప్రయోజనాలపై మమతా ఓసారి ఆలోచించాలి’ అని శశిథరూర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

రాహుల్‌ గాంధీ నాయకత్వ లక్షణాలపై వస్తోన్న ఆరోపణలను శశిథరూర్‌ తోసిపుచ్చారు. పలు సందర్భాల్లో పార్టీకి రాహుల్‌ చేసిన సేవలను గుర్తుచేసిన ఆయన.. ఆయనను పార్టీ అధ్యక్షుడిగా చూడాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక పార్టీలో ఉన్న సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకుంటామని.. త్వరలోనే సమస్యలన్నీ సమసిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని