TS News: ఫెయిలైన విద్యార్థులను పట్టించుకోకపోతే ఎలా?: జగ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విషయంలో ప్రభుత్వం నిద్ర పోతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రెండేళ్లుగా ఇంటర్‌ బోర్డు తీరు వల్ల విద్యార్థులు ఇబ్బందులు ..

Published : 24 Dec 2021 01:09 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విషయంలో ప్రభుత్వం నిద్ర పోతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రెండేళ్లుగా ఇంటర్‌ బోర్డు తీరు వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అయిన నేపథ్యంలో ఆయన నగరంలోని నాంపల్లి ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘4.5లక్షల మంది ఇంటర్‌ విద్యార్థులు పరీక్ష రాస్తే 2.35 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. చాలా రాష్ట్రాల్లో కొవిడ్ కారణంగా విద్యార్థులను పాస్‌ చేశారు. ఇక్కడ మాత్రం విద్యార్థులు చనిపోతున్నా ఎందుకు పాస్ చేయడం లేదు?ఫెయిల్ అయిన వారంతా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులే. కరోనా కారణంగా వారికి ఆన్‌లైన్‌ క్లాసులు జరగలేదు. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించలేదు.ప్రైవేట్ కాలేజీల్లో ఆన్‌లైన్‌ తరగతులు జరగడంతో వారు పాస్‌ అయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులను పట్టించుకోకపోతే ఎలా? విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తోంది? దీని వల్ల ప్రతిరోజూ పిల్లలు చనిపోతున్నారు. ఫెయిల్‌ అయిన విద్యార్థుల విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఆలస్యం అయితే ఉపయోగం ఉండదు’’ అని జగ్గారెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని