Kamal Haasan: భాజపా వ్యతిరేక కూటమితో జతకలుస్తారా..?

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నటుడు, మక్కల్‌ నీధి మయ్యం(MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ పేర్కొన్నారు.

Published : 04 Aug 2021 01:41 IST

ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ ఏమన్నారంటే..

దిల్లీ: భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నటుడు, మక్కల్‌ నీది మయ్యం(MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ పేర్కొన్నారు. పరిస్థితులను బట్టి వారు (భాజపా వ్యతిరేక పార్టీలు) ఆహ్వానిస్తే వారితో జతకలిసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. కేంద్రంలో భాజపాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోన్న కూటమిలో మీరు చేరతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కమల్‌ హాసన్‌ ఈవిధంగా సమాధానమిచ్చారు.

గడిచిన 11రోజులుగా పార్లమెంట్‌ను కుదిపేస్తోన్న పెగాసస్‌ అంశంపైనా కమల్‌ హాసన్‌ స్పందించారు. ‘ప్రస్తుతం పార్లమెంటులో జరుగుతున్నది ప్రతిచర్యే. ఇది నిఘా ప్రభుత్వం కాదు. మీరు వ్యక్తిగత జీవితాల్లో తొంగిచూడకూడదు’ అని  ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. ఇక కావేరి నదిపై మేకేదాటు ప్రాజెక్టు అంశంపై మాట్లాడిన ఆయన.. సినిమాల్లో నేను కూడా రెండు పాత్రల్లో (Double Roles) నటించానని వెల్లడించారు. రాజకీయాల్లో రెండు పాత్రలు పోషిస్తున్న వారిని కనిపెడతానని అన్నారు. పేర్లు వేరయినప్పటికీ కేంద్రం చేతుల్లో ఇద్దరూ కీలుబొమ్మలేనని బొమ్మై పేరును పరోక్షంగా ప్రస్తావించారు.

ఇదిలాఉంటే, ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కమల్‌ హాసన్‌ పార్టీ (మక్కల్‌ నీది మయ్యం) ఏ ఒక్క స్థానంలోనూ గెలవలేదు. కోయంబత్తూర్‌ దక్షిణం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కమల్‌ కూడా ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. అయినప్పటికీ తన ఊపిరి ఉన్నంతవరకూ రాజకీయాల్లో కొనసాగుతానని కమల్‌ హాసన్‌ స్పష్టం చేశారు. రాజకీయాలు ఉన్నంత వరకు తమ పార్టీ ఉంటుందని గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని