Raghurama: ఈ పరిస్థితుల్లో పాఠశాలలు తెరిచి ఏం సాధిస్తారు?: రఘురామ

దేశంలో అందరూ ఒకరకంగా ఆలోచిస్తే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మరో విధంగా ఆలోచిస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. కరోనా..

Updated : 25 Jul 2021 16:11 IST

దిల్లీ: దేశంలో అందరూ ఒకరకంగా ఆలోచిస్తే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మరో విధంగా ఆలోచిస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో ఎలాగైనా పరీక్షలు పెట్టి తిరుతామని మొండిపట్టుదలతో ప్రభుత్వం వ్యవహరిస్తే.. సుప్రీంకోర్టు జోక్యంతో పరీక్షలు రద్దయ్యాయని గుర్తు చేశారు. ఆగస్టు 16 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు మరో విషమ పరీక్షను ఎదుర్కోబోతున్నారని రఘురామ వ్యాఖ్యానించారు.

‘‘కరోనా మూడో దశ వచ్చే అవకాశం ఉన్నందున దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్టంలో నిత్యం 2వేల నుంచి 3 వేల కొవిడ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గతంతో పోలిస్తే దేశ రాజధాని దిల్లీలో తక్కువ కేసులు నమోదువుతున్నా ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలా అలోచించలేకపోతుంది?ఈ విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాఠశాలల ప్రారంభంపై రహస్య బ్యాలెట్ నిర్వహించండి. అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా వాలంటీర్ల ద్వారా సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించండి. ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. మీరు 40ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పెద్దలు, సలహాదారులు చెప్పిన మాటలు సీఎం వినాలి. మీరే తెలివైనవారు అనే అపోహ నుంచి బయటపడాలి. ఇప్పుడు పాఠశాలలు తెరిస్తే రాబోయే ఉపద్రవాన్ని ఊహించండి. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలు ప్రారంభించి ఏం సాధించాలనుకుంటున్నారు’’ అని రఘురామ  కృష్ణరాజు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని