లక్షకు ఒక్కరు తక్కువైనా.. కేసీఆర్‌కు గులాంగిరి చేస్తాం: రేవంత్‌

దళితులకు రూ.10లక్షలు ప్రకటించినట్టే.. గిరిజనులకు  కూడా రూ.10లక్షలు ప్రకటించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈనెల 9న ఇంద్రవెల్లిలో జరగబోయే

Updated : 05 Aug 2021 06:13 IST

హైదరాబాద్‌: దళితులకు రూ.10లక్షలు ప్రకటించినట్టే.. గిరిజనులకు  కూడా రూ.10లక్షలు ప్రకటించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈనెల 9న ఇంద్రవెల్లిలో జరగబోయే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ వాల్‌పోస్టర్‌ను ప్రకాశం హాలులో జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.  ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17వరకు జరిగే దళిత, గిరిజన దండోరా కార్యక్రమాల్లో ఒక రోజు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొంటారని తెలిపారు.  పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన బిడ్డలను చిత్రహింసలకు గురిచేస్తూ  చెట్లకు కట్టేసి కొడుతుంటే సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

కొమరంభీమ్‌ స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్ని నిర్బంధాలు విధించినా లక్ష మందితో ఇంద్రవెల్లిలో సభ పెట్టి తీరుతామని స్పష్టం చేశారు. లక్షకు ఒక్కరు తక్కువైనా.. సీఎం కేసీఆర్‌కు గులాంగిరి చేస్తామని సవాల్‌ విసిరారు. తుడుందెబ్బ అంటే ఉడుం పట్టు అని నిరూపిస్తామని స్పష్టం చేశారు. గిరిజనులు అమాయకులే అయినా.. ఆలోచన లేనివారు కాదని, గిరిజనుల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని ఆరోపించారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్‌ ఇంటికి రూ.10లక్షలు ప్రకటించారని ధ్వజమెత్తారు. రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఇస్తారో ఎందుకు చెప్పట్లేదని నిలదీశారు. ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం రూ.15లక్షల కోట్లు ఖర్చు చేస్తే... అందులో గిరిజనులకు ఖర్చు పెట్టింది ఎంత? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని