Chandrababu: వైకాపాను గద్దె దించి రాష్ట్రాన్ని రిపేరు చేయాలి: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రాన్ని రిపేరు చేయాల్సిన సమయం వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలు అవస్థలు పడతుంటే తాడేపల్లి ప్యాలెస్‌లో

Updated : 06 Oct 2021 17:34 IST

అమరావతి: వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రాన్ని రిపేరు చేయాల్సిన సమయం వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలు అవస్థలు పడతుంటే తాడేపల్లి ప్యాలెస్‌లో పైశాచిక ఆనందం పొందుతున్న సీఎం జగన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు సమష్టిగా పోరాడాలన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని పార్టీ శ్రేణులను అభినందించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వసం, రాక్షస పాలన కొనసాగుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని.. సంక్షేమం పేరుతో పెద్దఎత్తున దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు మాట్లాడినా, ప్రశ్నించినా అక్రమ కేసులు, బెదిరింపులతో నోరు మూయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు తెదేపా ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ, పంట పరిహారం చెల్లింపులు చేయకుండా రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కేవలం 30శాతం పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకున్నారని ఆక్షేపించారు. అప్పుల బాధ తాళలేక రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి నెలకొందని.. విత్తనాలు సరిగా పంపిణీ చేయకపోవటంతో దిగుబడి కూడా పడిపోయిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని