Ts News: హుజూరాబాద్‌ ఉపఎన్నిక.. తెరాస స్టార్‌ క్యాంపెయినర్స్‌ ఖరారు

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెరాస స్టార్‌ క్యాంపెయినర్స్‌ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మొత్తం 20 మంది నేతల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘాని (ఈసీ)కి

Updated : 30 Sep 2022 14:45 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెరాస స్టార్‌ క్యాంపెయినర్స్‌ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మొత్తం 20 మంది నేతల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి సమర్పించింది. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు సంకే రవిశంకర్‌, వి.సతీష్ కుమార్‌, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కనుమళ్ల విజయ, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్‌, నన్నపనేని నరేందర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి స్టార్‌ క్యాంపెయినర్లుగా తెరాస పేర్కొంది.  రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బాల్కా సుమన్‌, గువ్వల బాలరాజు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఇటీవల తెరాసలో చేరిన హుజూరాబాద్‌ నియోజకవర్గ నేత ఇ.పెద్దిరెడ్డిని కూడా స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు.

నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల కోడ్‌ వర్తింపు..

ఏదైనా నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే ఆ జిల్లా మొత్తం ఎన్నికల కోడ్‌ వర్తిస్తుంది. అయితే 2018లో రాజస్థాన్‌లోని దుడు శాసనసభ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరిగినప్పుడు జైపూర్ జిల్లా మొత్తం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని మొదట ఈసీ ప్రకటించింది. అయితే రాష్ట్ర రాజధాని కూడా అదే జిల్లాలో ఉన్న నేపథ్యంలో సాధారణ పరిపాలనకు ఇబ్బంది అవుతుందని ఈసీకి విజ్ఞప్తులు అందాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే జిల్లా మొత్తం కాకుండా కేవలం ఉపఎన్నిక జరిగే నియోజకవర్గానికి మాత్రమే నియమావళి వర్తిస్తుందని ఆ సమయంలో ఈసీ స్పష్టత ఇచ్చింది. తాజాగా తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం... ఆ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపింది. హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా.. హనుమకొండ జిల్లాలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. రెండు జిల్లాల్లోనూ కార్పొరేషన్లు ఉన్నందున కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని